
పాట్నా: బిహార్‌లో ఓట్ల దొంగతనానికి సంబంధించి.. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీవద్ద ఉన్న ఆధారాల అణుబాంబును వెంటనే పేల్చాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. అలాగే, ఆ బాంబుతో తనకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేసి పెడుతోందని.. అందుకు సంబంధించి తన వద్ద అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని శుక్రవారం రాహుల్‌గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమైనవని, క్రూరమైన ఆరోపణలని ఖండించింది. కాగా, శనివారం బిహార్ రాజధాని పాట్నాలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఆరోపణలపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. "రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో భూకంపం వస్తుందని గతంలో చెప్పారు. కానీ, అది తుస్సుమన్నది.
ఇప్పుడు మళ్లీ అలాంటి సంచలన వ్యాఖ్యలే చేస్తున్నారు. ఆయన వద్ద ఎలాంటి సాక్ష్యాలూ లేవు" అని విమర్శించారు. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ అని, దానిపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి, కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదని రాజ్‌నాథ్ సింగ్ హితవు పలికారు. బిహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగేలా చూసుకోవడానికి ఈసీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
బిహార్ ఎన్నికల గురించి మాట్లాడుతూ, రాష్ట్రం ఒక కీలకమైన దశలో ఉందని పేర్కొన్నారు. ఎన్‌డీఏ హయాంలో పురోగతి సాధించిన బిహార్‌ను ఇండియా కూటమి మళ్లీ అరాచకం, కుల విభేదాల గత యుగంలోకి నెట్టివేస్తుందని విమర్శించారు. నితీశ్ కుమార్ నాయకత్వంలో గత 20 ఏండ్లలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని రాజ్‌నాథ్ తెలిపారు.