ఒడిశా విద్యార్థిని మృతి కేసు..ఇది బీజేపీ సిస్టమ్ చేసిన హత్య: కాంగ్రెస్ నేతల ఆరోపణ

ఒడిశా విద్యార్థిని మృతి కేసు..ఇది బీజేపీ సిస్టమ్ చేసిన హత్య: కాంగ్రెస్ నేతల ఆరోపణ
  • ఆస్పత్రిలో మూడ్రోజులు మృత్యువుతో పోరాటం
  • ఇది బీజేపీ సిస్టమ్ చేసిన హత్య: కాంగ్రెస్ నేతల ఆరోపణ

భువనేశ్వర్: ఒడిశాలో లెక్చరర్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ ఒంటిపై పెట్రోల్‌‌‌‌ పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థిని సోమవారం రాత్రి ప్రాణాలు విడిచింది. బాలాసోర్‌‌‌‌లోని ఫకీర్ మోహన్ కాలేజీలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతున్న స్టూడెంట్‌‌‌‌ను కాలేజీలో ఓ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ హెడ్‌‌‌‌ అయిన సమీర్ సాహూ లైంగికంగా వేధించాడు. తను చెప్పినట్టు వినకుంటే భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరించాడు. ఇవన్నీ భరించలేక ఆ విద్యార్థిని కాలేజీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఫిర్యాదు చేసింది. 

అయితే యాజమాన్యం మాత్రం సదరు లెక్చరర్‌‌‌‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వారం రోజులు కాలేజీలో నిరసన తెలిపిన బాధితురాలు.. తనకు న్యాయం జరగదనే ఆవేదనతో గత శనివారం ఒంటిపై పెట్రోల్‌‌‌‌ పోసుకొని నిప్పంటించుకుంది. తోటి స్టూడెంట్లు మంటలార్పి ఎయిమ్స్​కు తరలించారు. అయితే, ఆమె శరీరం 95 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలింది. మంగళవారం ఆమె స్వగ్రామం పలాసియాలో అంత్యక్రియలు నిర్వహించారు. ‘‘నా బిడ్డ న్యాయం కోసం పోరాడింది. 

నాకు ఎక్స్‌‌‌‌గ్రేషియా అక్కరలేదు. నా బిడ్డను తిరిగి ఇవ్వగలరా?’’ అని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. సోమవారం ఉదయం భువనేశ్వర్ పర్యటనకు వెళ్లిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఎయిమ్స్ బర్న్స్ విభాగాన్ని సందర్శించి, విద్యార్థిని స్థితిని తెలుసుకున్నారు. ఆమె కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితురాలు మరణించిందని తెలిసి విచారం వ్యక్తం చేశారు.

దేశ బిడ్డలు చనిపోతున్నా మౌనమేనా?

స్టూడెంట్ మరణం బీజేపీ సిస్టమ్ చేసిన హత్య అని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘మోదీ గారు.. ఒడిశా నుంచి మణిపూర్ వరకు దేశ బిడ్డలు కాలిపోతున్నారు, కూలిపోతున్నారు, చనిపోతున్నారు. మీరు మాత్రం మౌనంగా ఉన్నారు. దేశానికి సమాధానాలు కావాలి.. మీ మౌనం కాదు’’ అని రాహుల్​ గాంధీ మండిపడ్డారు. 

►ALSO READ | కీచక లెక్చరర్లు..నోట్స్ ఇప్పిస్తానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారం

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని ఆత్మాహుతి చేసుకొని మరణించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో రాష్ట్రంలోని ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు జులై 17న ఒడిశా బంద్‌‌‌‌కు పిలుపునిచ్చాయి. కాగా, విద్యార్థి మరణం బాధను కలిగించిందని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ విచారం వ్యక్తం చేశారు. నిందితులకు  కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చారు.