రాహుల్ X సురేంద్రన్?

రాహుల్ X సురేంద్రన్?
  • కేరళలోని వయనాడ్​ స్థానంపై బీజేపీ గురి 
  • పార్టీ స్టేట్ చీఫ్​ను బరిలోకి దింపిన కమలనాథులు
  • సీపీఐ నుంచి బరిలోకి డి.రాజా సతీమణి యానీ రాజా
  • ఇప్పటికే ప్రచారం షురూ చేసిన సురేంద్రన్, యానీ రాజా

తిరువనంతపురం: కాంగ్రెస్ మాజీ చీఫ్ ​రాహుల్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేరళలోని వయనాడ్ లో ఈ సారి ఎన్నికలు హోరాహోరిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ పై బీజేపీ స్టేట్ చీఫ్ కె. సురేంద్రన్ ను ఆ పార్టీ బరిలోకి దించడంతో వయనాడ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. కేరళలో బీజేపీకి అంతగా పట్టు లేకపోయినా.. రాహుల్​పై తమ పార్టీ స్టేట్ చీఫ్​ను పోటీకి దింపడం ద్వారా ఈ ఎన్నికల్లో సీరియస్ ఫైట్​కు సిద్ధమన్న సంకేతాలను కమలం పార్టీ ఇచ్చినట్లయింది. 

ముస్లింల ప్రాబల్యం ఉన్న వయనాడ్ 2009 నుంచీ కాంగ్రెస్​కు కంచుకోటగా ఉంది. పోయినసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీతోపాటు ఇక్కడ పోటీ చేశారు. అమేథీలో ఆయన ఓడిపోగా, వయనాడ్ లో మాత్రం భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, ఈ సారి ఆయనకు అమేథీలో మాదిరిగా ఓటమి తప్పదని సురేంద్రన్ ఇటీవల చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

 ఇప్పటికే ప్రచారం షురూ చేసిన సురేంద్రన్ వరుస ర్యాలీలతో దూసుకుపోతున్నారు. ఇక రాష్ట్రంలోని అధికార లెఫ్ట్ కూటమి నుంచి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా భార్య యానీ రాజాను వయనాడ్ లో బరిలోకి దింపారు. ఆమె కూడా ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం ఇంకా క్యాంపెయిన్​ ప్రారంభించలేదు.  వయనాడ్ తోపాటు కేరళలోని అన్ని ఎంపీ సీట్లకు రెండో ఫేజ్​లో ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనుంది. 

పోయినసారి ఎన్నికల్లో ఇలా.. 

కేరళలో మొత్తం 20 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వయనాడ్​లో 10.92 లక్షలకుపైగా ఓటర్లు ఉండగా, 2019 ఎన్నికల్లో 80.37% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ నేత రాహుల్​కు 7 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. 4.31 లక్షల భారీ మెజార్టీతో ఆయన గెలిచారు. సీపీఐ అభ్యర్థి పి.పి. సునీర్ 2.74 లక్షల ఓట్లతో రెండో ప్లేస్ లో నిలిచారు. ఇక మూడో ప్లేస్​లో నిలిచిన  బీజేపీ మిత్రపక్షమైన భారత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) అభ్యర్థి తుషార్ వెల్లపల్లికి 78 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.  

ఎవరీ సురేంద్రన్? 

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేత కున్నుమ్మెల్ సురేంద్రన్. కోజికోడ్ జిల్లాలోని ఉల్లెయిరికి చెందిన ఈయన 2020 నుంచి బీజేపీ కేరళ స్టేట్ చీఫ్​గా ఉన్నారు. వయనాడ్ జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో ఈయన పథనంథిట్ట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే ఏడాది కొన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలోనూ ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నుంచి పోటీ చేసి కేవలం 89 ఓట్ల తేడాతో పరాజయం చెందారు.  

రాహుల్​కు ‘అమేథీ’ గతే పడ్తది: సురేంద్రన్ 

ఇటీవల వయనాడ్​లో ప్రచారం ప్రారంభిస్తూ సురేంద్రన్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్​తోపాటు తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ నుంచి పోటీ చేయగా.. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇదే విషయాన్ని సురేంద్రన్ ప్రస్తావిస్తూ.. వయనాడ్​లో ఈ సారి రాహుల్​కు అమేథీ మాదిరిగానే పరాజయం తప్పదని అన్నారు.