పరిమితికి మించి సామాను తీసుకువెళ్తే.. రైళ్లలో అదనపు లగేజీ చార్జీలు

పరిమితికి మించి సామాను తీసుకువెళ్తే.. రైళ్లలో అదనపు లగేజీ చార్జీలు

న్యూఢిల్లీ: రైలులో ప్రయాణించేటప్పుడు పరిమితికి మించి సామాను తీసుకువెళ్తే ప్రయాణికులు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బుధవారం లోక్ సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సెకండ్ క్లాసులో ప్రయాణికుడు 35 కిలోల సామాను ఫ్రీగా, 70 కిలోల వరకు చార్జ్ చెల్లించి తీసుకెళ్లడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. 

స్లీపర్ క్లాస్ ప్రయాణికులు ఉచితంగా 40 కిలోలు, 80 కిలోల వరకు చార్జ్ చెల్లించి తీసుకెళ్లడానికి అనుమతి ఉందని వెల్లడించారు. ఏసీ 3 టైర్, చైర్ కార్‌‌‌‌ లో ప్రయాణించే ప్రయాణికులు 40 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చని... ఇదే గరిష్ట పరిమితని వివరించారు. 

ఫస్ట్ క్లాస్,  ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కిలోల సామాను ఉచితంగా, 100 కిలోల వరకు చార్జ్ చెల్లించి తీసుకెళ్లడానికి అనుమతి ఉందని పేర్కొన్నారు. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కిలోల వరకు ఉచితంగా, 150 కిలోల వరకు చార్జ్ చెల్లించి తీసుకువెళ్లవచ్చని తెలిపారు.