శ్రామిక్​ ట్రైన్లలో గొడవలు జరగొద్దు

శ్రామిక్​ ట్రైన్లలో గొడవలు జరగొద్దు

జోన్లకు రైల్వే శాఖ గైడ్​లైన్స్
న్యూఢిల్లీ: వలస కార్మికులను సొంతూళ్లకు తీసుకెళుతున్న శ్రామిక్​ స్పెషల్​ ట్రైన్లలో సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని జోన్లను రైల్వే శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి మంగళవారం గైడ్​లైన్స్ రిలీజ్​ చేసింది. ప్రయాణం సందర్భంగా గొడవలు జరగకుండా చూడాలని, ప్రయాణికుల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని సూచించింది. శానిటేషన్​ ప్రొటోకాల్​ పాటించాలని, రైళ్లలో టాయిలెట్స్ క్లీనింగ్​ సహా ఇతర ఏర్పాట్ల కోసం వీలైనంత తక్కువ మందిని పంపించాలని ఆదేశించింది. ట్రైన్​ బయలుదేరే స్టేషన్​తో పాటు డెస్టినేషన్ స్టేషన్​లో, ట్రైన్​లోనూ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని, మైగ్రెంట్స్ సోషల్​ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

ఇందుకోసం మాజీ సైనికులు, హోంగార్డులు, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని టెంపరరీగా తీసుకోవాలని సూచించింది. ప్రయాణికులను తీసుకెళ్లడానికి ముందు, వారిని గమ్యస్థానం చేర్చాక రైలు బోగీలను శానిటైజేషన్​ చేయాలని పేర్కొంది. ఈ ట్రైన్లను నడిపించేందుకు అయ్యే ఖర్చులో 85 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రం భరిస్తుందని కేంద్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు నడిపించిన 34 ట్రైన్లకు రైల్వే శాఖ 24 కోట్లు వెచ్చించగా.. రాష్ట్ర ప్రభుత్వాలు 3.5 కోట్లు భరించాయని అధికార వర్గాలు తెలిపాయి.