- టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ రూల్స్ లో రైల్వే శాఖ మార్పులు
- 30 నిమిషాల ముందు వరకూ బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే చాన్స్
న్యూఢిల్లీ: టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ నిబంధనల్లో రైల్వే శాఖ మంగళవారం భారీ మార్పులు చేసింది. ముఖ్యంగా కన్ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేసుకునే టైంలో ప్రయాణికులకు వచ్చే రిఫండ్ మొత్తాన్ని తగ్గించేలా కొత్త టైమ్ విండోలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ఇకపై రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ టైం ఉన్నప్పుడు కన్ఫర్మ్ అయిన టికెట్ ను రద్దు చేస్తే ప్రయాణికులకు ఒక్క రూపాయి కూడా రిఫండ్ రాదు.
గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది. కానీ ఇప్పుడు దానిని రెట్టింపు చేస్తూ 8 గంటలకు పెంచారు. రైలు బయలుదేరడానికి 3 రోజుల కంటే ముందు (72 గంటల పైన) టికెట్ రద్దు చేస్తే దాదాపు పూర్తి డబ్బు వెనక్కి వస్తుంది. కేవలం క్యాన్సిలేషన్ ఛార్జీలు మాత్రమే కట్ అవుతాయి.
ఇక, ప్రయాణానికి 24 గంటల నుంచి 72 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే టికెట్ ధరలో 25 శాతం మొత్తాన్ని రైల్వే కోత విధిస్తుంది. ఒకవేళ 8 గంటల నుంచి 24 గంటల లోపు రద్దు చేసుకుంటే.. ప్రయాణికులు ఏకంగా 50 శాతం మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. టికెట్ దళారుల ఆగడాలను అరికట్టేందుకు, చివరి నిమిషంలో టికెట్లు రద్దు చేసి రిఫండ్ పొందే విధానాన్ని నియంత్రించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
మరోవైపు, ప్రయాణికుల సౌకర్యార్థం బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే గడువును మాత్రం రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు పొడిగించారు. దీనివల్ల చివరి నిమిషంలో ప్రయాణికుల ప్లాన్ మారినా తమ సీటును సురక్షితంగా ఉంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల 1వ తేదీ నుంచి15 వ తేదీ మధ్య దశలవారీగా అమలులోకి వస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి ప్యాసింజర్లు తమ ప్రయాణం క్యాన్సిల్ అయితే 8 గంటల ముందే నిర్ణయం తీసుకోవడం మంచిదని పేర్కొంది.
