తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు

తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు
  • ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్​
  • పిడుగులు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని మంగళవారం తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురవొచ్చని చెప్పింది. 

హైదరాబాద్​లోనూ తేలికపాటి జల్లులు పడే చాన్స్ ఉందంది. రోజంతా మబ్బులు, ఉదయం పొగమంచు ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు మంగళవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, జనగామ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. మరికొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. 

అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లా బజార్​హత్నూర్​లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం జిల్లాలోని నెల్లిలో 2.7, ఆదిలాబాద్​ జిల్లా తలమడుగులో 2.1, సిరికొండలో 2, పిప్పల్​ధారిలో 1.8, జైనథ్​లో 1.7, ఆదిలాబాద్​లో 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆదిలాబాద్​లో ఓవైపు ఎండ, మరోవైపు వానలు

రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో వాతావరణం మారిపోయింది. ఆదిలాబాద్​ జిల్లాలో పలు చోట్ల వర్షాల ప్రభావం ఉన్నా.. ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో రికార్డ్​ అయ్యాయి. ఆ జిల్లాలోని జైనథ్​లో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్​నగర్​, నల్గొండ జిల్లాల్లోనూ టెంపరేచర్లు సాధారణం కన్నా రెండుమూడు డిగ్రీలు ఎక్కువే నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 39.6 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో 39.4, వనపర్తి జిల్లా దగడులో 39.1, నిర్మల్​ జిల్లా అక్కాపూర్​లో 38.2, నల్గొండ జిల్లా నేరేడుగొమ్ములో 38.1 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్​ అయ్యాయి.