ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించిన వర్షం.. తగ్గనున్న పొల్యూషన్

ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించిన వర్షం.. తగ్గనున్న పొల్యూషన్

న్యూఢిల్లీ: విపరీతంగా పెరిగిపోయిన గాలి కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీవాసులకు ఒక్క వాన ఉపశమనం కలిగించింది. పది రోజులుగా పొగ మంచు రూపంలో కమ్మేసిన పొల్యూషన్.. వర్షం పడటంతో క్లియర్ అయింది. దీంతో ఎయిర్ క్వాలిటీ పెరిగింది. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు 408గా ఉన్న ఏక్యూఐ.. మధ్యాహ్నం 2 గంటలకు 302కు చేరుకుంది. గురువారం రాత్రి 11 సమయంలో ఏకంగా 460 దాకా ఏక్యూఐ నమోదైంది. ఎయిర్ క్వాలిటీ మెరుగుపడినా.. ఢిల్లీ ఇంకా ‘వెరీ పూర్’ కేటగిరీలోనే ఉంది. అయితే గాలుల్లో వేగం పెరిగే అవకాశం ఉందని, దీంతో పొల్యూషన్ మరింత తగ్గొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

‘‘గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం దాకా 24 గంటల్లో సఫ్దార్ జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో 6 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి  మధ్యాహ్నం దాకా మరో 2.2 మిల్లీమీటర్లు కురిసింది. ఢిల్లీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి” అని ఐఎండీ తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి వానలు పడుతున్నట్లు ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ కుల్దీప్ శ్రీవాస్తవ వెల్లడించారు. గాలులు వీచే డైరెక్షన్ మారుతున్నదని, దీంతో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వస్తున్న పొగ రావడం తగ్గుతుందని చెప్పారు.

‘సరి – బేసి’ అమలు వాయిదా

ఢిల్లీలో ‘సరి – బేసి’ విధానం అమలును వాయిదా వేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ క్వాలిటీ మెరుగుపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్ చెప్పారు. ‘‘దీపావళి తర్వాత ఎయిర్ క్వాలిటీ పరిస్థితిపై రివ్యూ చేస్తాం. ఒకవేళ పొల్యూషన్ లెవెల్స్ పెరిగితే ‘సరి – బేసి’ స్కీమ్ అమలుపై నిర్ణయం తీసుకుంటాం” అని వివరించారు. అంతకుముందు ‘సరి – బేసి’ స్కీమ్ ప్రభావంపై సుప్రీంకోర్టు రివ్యూ చేసి, ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తొలుత చెప్పారు. అయితే, వర్షంతో గాలినాణ్యత పెరగడంతో ‘సరి – బేసి’ అమలు వాయిదా వేసినట్లు చెప్పారు.

ఆస్పత్రుల్లో సౌలతులు పెంచండి: కేంద్రం

గాలి కాలుష్యం కారణంగా పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా హాస్పిటళ్లలో సౌలతులు కల్పించాలని ఢిల్లీ, దాని పక్కనున్న రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈమేరకు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లెటర్ రాసింది. ‘‘నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో గత కొన్ని రోజులుగా కాలుష్యం పెరిగింది. దీపావళి పండగతో పాటు వింటర్ కారణంగా కాలుష్యం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీంతో జనం అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఆస్పత్రుల్లో సౌలతులు కల్పించాలి. బెడ్ల సంఖ్యను పెంచాలి. సరిపడా మెడిసిన్స్, ఇతర ఎక్విప్ మెంట్, సిబ్బందిని అందుబాటులో ఉంచాలి” అని సూచించింది.