గంట సేపట్లోనే వరంగల్ను ముంచేసిన వాన.. వరదలకు నగరం అతలాకుతలం..

గంట సేపట్లోనే వరంగల్ను ముంచేసిన వాన.. వరదలకు నగరం అతలాకుతలం..

వరంగల్ లో వర్షం దంచికొట్టింది. ఇటీవల కామారెడ్డి, మెదక్ లో వచ్చిన వరదలను తలపించేలా వరదలు పోటెత్తాయి. భారీ వరదలకు వరంగల్, హన్మకొండ జంట నగరాలలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 07) కురిసిన కుండపోత వానకు నగరం మొత్తం అతలాకుతలం అయ్యింది. ఎటు చూసిన నీళ్లు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

గంటల వ్యవధిలోనే భారీ వర్షం కురవడంతో వరద పోటెత్తింది. హనుమకొండ, కాజీపేట, వరంగల్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో మోకాళ్లలోతు నీళ్లు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో బైకులు ఆపి షటర్ల కిందికి పరుగెత్తారు జనం. 

శివనగర్ అండర్ రైల్వే బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు, బస్సులు సగం మునిగిపోయేంతలా నీళ్లు చేరుకోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు హన్మకొండలోని భవాని నగర్ పూర్తిగా జలదిగ్బంధంలో కూరుకుంది.  ప్రధాన రహదారి చెరువులను తలపిస్తూ ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తోంది. 

ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి భారీ వరదలు వరంగల్ నగరాన్ని షేక్ చేశాయి. వరద నీటిలో బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్సు సగం వరకు మునిగేలా వరద నీరు నిలిచి పోయింది. దీంతో ప్రయాణికులను కిందికి దింపి తాళ్ల సహాయంతో నీళ్లనుంచి బయటకు తీసుకు వచ్చారు ఇంతేజార్ గంజ్  పోలీసులు.