అసని ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

అసని ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫాను నుంచి తుఫానుగా అసని బలహీనపడిందని తెలిపింది వాతావరణ శాఖ. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది అసని తుఫాను. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.కాకినాడ దగ్గర మళ్లీ సముద్రంలోకి వచ్చి బలహీన పడే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపింది విపత్తుల నిర్వహణ సంస్థ. రేపు సాయంత్రానికి వాయుగుండగా తుఫాను బలహీనపడనుంది. తీరానికి అతి దగ్గరగా రావడంతో గాలుల తీవ్రత తగ్గింది. తుఫాను కారణంగా 3 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. 

మచిలీపట్నం దగ్గర తీరాన్ని తాకిన తర్వాత మళ్లీ విశాఖ దగ్గర సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తుఫాను ప్రభావంతో ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.


తుఫాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి నుంచే మెరైన్ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధాన బీచ్ లలో ప్రవేశాలను నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కృత్తి వెన్ను, నాగాయలంక, మచిలీపట్నం సహా చుట్టుపక్కల షెల్టర్ హోమ్స్ అందుబాటులోకి తెచ్చారు. నిజాంపట్నం హార్బర్ లో ఎనిమిదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అసని తీవ్రతపై కేంద్రం హోంమంత్రిత్వ శాఖ అధికారులు సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయచర్యల నిమిత్తం ఎన్ డీఆర్ఎఫ్, ఎస్ డీఆర్ ఎఫ్ దళాలను సిద్ధం చేసినట్లు తెలిపారు విపత్తు నిర్వాహణ శాఖ అధికారులు. తుఫాను సహాయక చర్యల కోసం నేవీ సిద్ధమైంది. 19 వరద సహాయక బృందాలతో పాటు 6 డైవింగ్ బృందాలు రెడీ అయ్యాయి. తుఫాను ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.

తుఫాను ప్రభావంతో గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు సముద్రతీరం అలజడిగా ఉంటుందని పేర్కొంది. తుఫాను కారణంగా ఇవాళ జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేసింది ఇంటర్ బోర్డు. ఇంటర్ పరీక్షలను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు, కంచిలి, డొంకూరు తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. రణస్థలం తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. గార మండలం బందరువాని పేట దగ్గర ఉప్పుగెడ్డ పొంగడంతో.. గ్రామం చుట్టూ నీరు చేరింది.

రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. రేపు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు.

విశాఖ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సిన 31 విమానాలను అసని తుఫాను కారణంగా రద్దు చేసినట్లు తెలిపారు అధికారులు. వాతావరణం అనుకలించకపోతే... ఇవాళ కూడా ఫ్లైట్లు రద్దు చేస్తామన్నారు.

మరిన్ని వార్తల కోసం

రివ్యూ పూర్తయ్యే వరకు దేశద్రోహ చట్టాన్ని ఆపేస్తరా?

జూన్ లో వానాకాలం రైతుబంధు