
కొండపాక(కొమురవెల్లి), పాపన్నపేట, వెలుగు:చెడగొట్టు వాన రైతులను వెంటాడుతోంది. వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వడళ్ల వానకు రైతులు ఆగమాగం అవుతున్నారు. ఆదివారం కూడా మెదక్, మర్కుక్ మండలాలతో పాటు పాపన్నపేట మండలం రామతీర్థం, ఉద్దాపూర్, ఆరెపల్లి,పాపన్నపేట,కుర్తివాడ, కుకునూర్‌పల్లి మండలంమంగోల్, కుకునూర్‌పల్లి, బోబ్బయిపల్లి తదితర గ్రామాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలుతో రాళ్లు పడడంతో చేతికొచ్చిన వడ్లు పొలంలోనే రాలిపోయాయి.
చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వరితో పాటు మక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లోని మామిడి కాయలు నేలరాలాయి. దుబ్బాక పట్టణంలో హబ్సపూర్ రోడ్డులో భారీ వృక్షం నేల కూలింది. రాకపోకలు నిలచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చెట్టును తొలగించే పనులు చేపట్టారు.