IPL 2026: రాజస్థాన్ vs చెన్నై మ్యాచ్ కి వర్షం ముప్పు.. ఆందోళనలో అభిమానులు

IPL 2026: రాజస్థాన్ vs చెన్నై మ్యాచ్ కి వర్షం ముప్పు.. ఆందోళనలో అభిమానులు

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో తమ తొలి మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లకు వరుణుడి భయం పట్టుకుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోరుకి ముందు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తన మాజీ ఫ్రాంచైజీ (CSK) పై సంజూ శాంసన్ పోటీ పడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో ఈ పోరుపై భారీ అంచనాలు ఉన్నాయి.

వాతావరణ పరిస్థితి: 
ఈరోజు ఉదయం గౌహతిలో భారీ వర్షం కురిసింది. స్టేడియం పరిసరాల్లో ఆకాశం పూర్తిగా నల్లని మేఘాలతో నిండిపోయింది. దీంతో వర్షం పడిన ఫోటోలని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇక ఆక్యువెదర్ (Accuweather) నివేదిక ప్రకారం, ఈరోజు (2026, మార్చి 30న) పగలు, సాయంత్రం వర్షం పడే అవకాశం 100 శాతంగా ఉంది. ఇది అభిమానుల్లో కొంత ఆందోళన కలిగించింది. అయితే అసలు ముచ్చట ఏమిటంటే, సమయం గడిచేకొద్దీ వర్షం తగ్గుముఖం పడుతుందని అంచనా.. రాత్రి సమయానికి వర్షం కురిసే అవకాశం కేవలం 25 శాతానికి తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.  

మ్యాచ్ జరుగుతుందా?: 
వర్షం కారణంగా ఆట మధ్యలో అంతరాయాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వర్షం పడినా, అది మ్యాచ్ ఫలితం తేలకుండా ఆగిపోయేంత సేపు ఉండకపోవచ్చు అని సమచారాం. కాబట్టి, క్రికెట్ అభిమానులు పూర్తి స్థాయి 20 ఓవర్ల మ్యాచ్ ని వీక్షించే అవకాశం ఉంది. కాగా మ్యాచ్ ప్రారంభ సమయానికి ఆకాశం క్లియర్ అవుతుందని, ఆటగాళ్లు మైదానంలోకి దిగుతారని ఐపీఎల్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.