18న అండమాన్లో మరో ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ 

18న అండమాన్లో మరో ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ 

ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లడం కూడా వర్షాలు కురిసేందుకు కారణమవుతోంది. ఇవాళ రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండ్రోజులు చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.

ద్రోణి ఎఫెక్ట్ తో ఇవాళ హైదరాబాద్ లో అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి. కొన్నిచోట్ల మోస్తరు వాన పడింది. కోఠి, అబిడ్స్, బషీర్ బాగ్ సహా చందానగర్, మియాపూర్, గచ్చిబౌలిలో వర్షం కురిసింది. ఇవాళ నల్గొండ జిల్లా మాడుగుల పల్లెలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని ముకుందాపురంలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

వచ్చే 2 రోజుల్లో విదర్భ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్  నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ఎఫెక్ట్ తో మరింతగా వర్షాలు పడే ఛాన్స్ ఉంటుందని తెలిపింది. ఈనెల18న అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అది నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.