అకాల వర్షానికి చేతికొచ్చిన వరిపంట, మామిడితోటలు ఆగమాగమయ్యాయి

అకాల వర్షానికి చేతికొచ్చిన వరిపంట, మామిడితోటలు  ఆగమాగమయ్యాయి

సూర్యాపేట వెలుగు:  అకాల వర్షానికి చేతికొచ్చిన వరిపంట, మామిడితోటలు  ఆగమాగమయ్యాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షం, గాలి దుమారంతో జిల్లాలోని సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), నేరేడు చర్ల, పెన్ పహాడ్, తుంగతుర్తి, నాగారం, తిరుమలగిరి మద్దిరాల, జాజిరెడ్డి గూడెం, మోతే మండలాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక వడ్లు తడిసి ముద్ధయ్యాయి. కొనుగోళ్లు డిలే కావడంతో సూర్యాపేట మార్కెట్​ ఇప్పటికే ధాన్యం కుప్పలతో కిక్కిరిసిపోయింది. శుక్రవారం ఒక్కరోజే 46వేల బస్తాల ధాన్యం రైతులు తీసుకొచ్చారు. దాదాపు 5వేల బస్తాలు కాంటాలు వేయకపోవడంతో ఈ వానకు కొంతమంది రైతుల వడ్లు తడిసిపోయాయి.  కాగా అత్యధికంగా తుంగతుర్తి మండలంలో 38.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో నాలుగు రోజుల పాటు జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొనడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లన్నీ త్వరగా కొనాలని కోరుతున్నారు. 

అధైర్య పడొద్దు : మంత్రి 

అకాలవర్షాలతో రైతాంగం అధైర్య పడొద్దని, అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జగదీశ్​రెడ్డి భరోసా కల్పిస్తున్నారు. రైతులకు ధీమా కలిగించాలని కలెక్టర్ వెంకట్ రావు కు ఆయన సూచించారు. అకాల వర్షాలపై కలెక్టర్ తో మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు సూచనలు చేస్తున్నారు. కాగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యం కొనాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. 

పంటల పరిశీలన.. 

తుంగతుర్తి/ చండూరు ( గట్టుపల ) : వెలుగు : అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పలువురు అధికారులు శనివారం పరిశీలించారు. సూర్యాపేట జిల్లా 
తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో హార్టికల్చర్ అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. నల్గొండ జిల్లా గట్టుప్పల మండలం తేరటుపల్లి, కమ్మ గూడెం, శేరిగూడెంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను తహసీల్దార్ వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు 
పరిశీలించారు. 

గోడకూలి 20 గొర్రెలు మృతి


చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి అకాల వర్షం, ఈదురుగాలులతో గోడకూలి 20 గొర్రెలు చనిపోయాయి. దీంతో బాధి తుడు పిల్లి రాజు యాదవ్ కన్నీరుమున్నీరవుతున్నా డు. సుమారు 2.50 లక్షల నష్టం వాటిల్లిందని వాపో యాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు.