
- వర్షాలకు సెంటర్లలో తడిసిన వడ్ల కుప్పలు
- కాంటాలు లేట్ చేయడంతో నిండా మునిగిన రైతులు
- జగిత్యాల జిల్లా చెల్‌గల్‌లో డ్రైనేజీలో కొట్టుకుపోయిన 120 క్వింటాళ్ల వడ్లు
- జనగామ జిల్లాలోని సెంటర్లలో 5 వేల టన్నులు తడిసినయ్
- వేలాది ఎకరాల్లో నేలవాలిన వరి అన్ని జిల్లాల్లోనూ భారీ నష్టం
- సిద్దిపేట జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
వడ్లు కాంటా పెట్టడంలో సర్కారు చేసిన ఆలస్యంతో రైతన్నల కష్టం నీటి పాలైంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తెల్లవారు జామున కురిసిన అకాల వర్షంతో సెంటర్లలో ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. చాలాచోట్ల వడ్లు నీటిలో కొట్టుకపోయాయి. కొన్ని చోట్ల కుప్పలు సైతం నీళ్లలో తేలియాడాయి. ఎగిలివారంగనే సెంటర్లకు ఉరికిన రైతులు అక్కడి పరిస్థితి చూసి కంటతడి పెట్టారు. సెంటర్లలో కొట్టుకపోయిన వడ్లను కుప్పపోయడానికి, కల్లాల్లో నిలిచిన నీళ్లను ఎత్తిపోయడానికి నానా తిప్పలు పడ్డారు. సర్కారు టైంకు వడ్లు కొనకపోవడం వల్లే తమ రెక్కల కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే అన్ని సెంటర్లు తెరిచి, కాంటాలు పెట్టి ఎలాంటి కొర్రీలు లేకుండా తడిసిన ధాన్యం కొనాలని వేడుకున్నారు.
వెలుగు, నెట్వర్క్/హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నిలిచిపోవడంతో వర్షాలకు దాదాపు అన్ని జిల్లాల్లోనూ వడ్లు తడిసిపోయి భారీ నష్టం వాటిల్లింది. కొద్దిరోజులుగా అక్కడక్కడ కురుస్తున్న చిన్నపాటి వర్షాలతో వడ్లలో మాయిశ్చర్ వస్తోంది. దీంతో సెంటర్లలో నిర్వాహకుల సూచనల మేరకు రైతులు రోజంతా ఎండకు ఆరబోస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి కురిసిన గాలివాన దెబ్బ తీసింది. టార్పాలిన్లు కూడా ఇవ్వకపోవడం, రైతులు కుప్పలపై కప్పుకున్న చిన్నచిన్న పట్టాలు గాలికి ఎగిరిపోవడంతో వడ్లన్నీ తడిసిపోయాయి.
మెదక్ జిల్లాలోని కొల్చారం, కౌడిపల్లి, శివ్వంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, రామాయంపేట, నిజాంపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో, రోడ్ల మీద ఎండబోసిన వడ్లు తడిసి, కొట్టుకపోయాయి. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సెంటర్లలోని వడ్లు తడిసి ముద్దయ్యాయి.జనగామ జిల్లాలో సెంటర్లలో ఉన్న సుమారు 5 వేల టన్నుల వడ్లు తడిసిపోయాయి. బచ్చన్నపేట మండలం గంగపురం, ఇటికాలపల్లిలో సుమారు 100 బస్తాల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని సెంటర్లలో ఆరబోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకపోయింది.
వరంగల్ జిల్లా రాయపర్తి మార్కెట్ యార్డ్‌కు తెచ్చిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, రామారెడ్డి, సదాశివనగర్, లింగంపేట మండలాల్లో సెంటర్లలోని వడ్లు తడిసిపోయాయి. పల్వంచ, భవానిపేట లాంటి సెంటర్లలో పది క్వింటాళ్లకు పైగా వడ్లు కొట్టుకపోయాయి. వడ్లను ఎత్తుకునేందుకు రైతులు పడరానిపాట్లు పడ్డారు. నల్గొండ జిల్లాలో ఐకేపీ సెంటర్ల వద్ద కొనుగోలు చేసిన 8,873 క్వింటాళ్ల వడ్లు తడిసిపోయాయి. యాదాద్రి జిల్లాలో 200 సెంటర్లు ఉండగా, దాదాపు అన్ని సెంటర్లలోనూ వడ్లు తడిసిపోయాయి. వారం క్రితం తెచ్చిన వడ్లను సైతం కొనలేదని, రాత్రి కురిసిన వర్షానికి 15 బస్తాల వడ్లు కొట్టుకొనిపోయాయని మోత్కూర్‌కు చెందిన రైతు -బైరు బిక్షం కన్నీరుమున్నీరయ్యాడు. మంచిర్యాల జిల్లాలో సుమారు 10 వేల క్వింటాళ్ల వడ్లు తడిసిపోయాయి. పలుచోట్ల వడ్ల కుప్పలు కొట్టుకుపోయాయి. రైతులు నీళ్లలోంచి వడ్లను దేవులాడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.
ఇప్పటికీ పది శాతం కూడా కొనలే
రాష్ట్రంలో యాసంగి వడ్ల కొనుగోళ్లు ప్రారంభించి నెలరోజులవుతున్నా ఇప్పటి వరకు పది శాతం ధాన్యం కూడా కొనలేదు. 7 వేల సెంటర్లు తెరుస్తామని చెప్పిన సివిల్సప్లయ్స్ శాఖ ఆఫీసర్లు కేవలం 3,525 సెంటర్లు ఓపెన్చేశారు. వాటిలో కనీసం పదో వంతు సెంటర్లలోనూ కొనుగోళ్లు జరగడం లేదు. 65 లక్షల టన్నుల వడ్లు కొంటామని చెప్పి 4.21 లక్షల టన్నులు మాత్రమే అతికష్టం మీద కొన్నారు. ఏప్రిల్5న కొనుగోళ్లు మొదలు కాగా.. టార్గెట్‌లో కనీసం పది శాతం కూడా వడ్లు కొనలేదు. సెంటర్లకు రిబ్బన్ కటింగులు చేసి లీడర్లు వెళ్లిపోతున్నా గన్నీబ్యాగులు లేకపోవడం, తమకు రూ.300 బోనస్ ఇచ్చేదాకా వడ్లు దింపుకోమని మిల్లర్లు చెప్పడంతో కాంటాలు నిలిచిపోతున్నాయి. మరోవైపు సెంటర్లు తెరిచారని భావిస్తున్న రైతులు వడ్లు తెచ్చి కుప్పలు పోసి ఎదురుచూస్తున్నారు.
కూరగాయల పంటలకూ దెబ్బ
సెంటర్లు, కల్లాల్లో వడ్లే కాదు, గాలివాన వల్ల వేలాది ఎకరాల్లో కోతకొచ్చిన వరి నేలవాలింది. కూరగాయల తోటలకూ నష్టం వాటిల్లింది. ఉద్యాన శాఖ అంచనాల ప్రకారం యాసంగిలో లక్షా 20 వేల ఎకరాల్లో కూరగాయల సాగు జరగాల్సి ఉన్నా అందులో సగమే సాగైంది. ఈసారి వాతావరణం అనుకూలంగా ఉండడంతో అధిక దిగుబడులు వస్తాయని రైతులు అంచనా వేశారు. కానీ అకాల వర్షాలు రైతుల ఆశలను ఆవిరి చేశాయి. అకాల వర్షాలతో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో టమాటా, వంకాయ, బీరకాయ, గోరుచిక్కుడు తదితర పంటలన్నీ దెబ్బతిన్నాయి.
పిడుగుపాటుతో కుప్ప వద్ద కాపలా ఉన్న రైతు మృతి
సిద్దిపేట, వెలుగు: కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్ప వద్ద కాపలాగా ఉన్న రైతు చనిపోయాడు. మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం నర్లెంగడ్డకు చెందిన సౌడు పోచయ్య (65).. తనకున్న ఎకరం పొలంలో పండించిన వడ్లను నాలుగు రోజుల క్రితం దగ్గర్లోని ఐకేపీ సెంటర్‌కు తరలించాడు. మాయిశ్చర్ఉండడంతో రోడ్డుపై ఆర బోసి, రాత్రి కుప్పగా జేసి అక్కడే పడుకుంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల టైంలో గాలివాన రాగా, ప్లాస్టిక్ కవర్‌ను వడ్ల కుప్పపై కప్పి పక్కనే ఉన్న వేపచెట్టు కింద నిలబడ్డాడు. చెట్టుపై పిడుగుపడటంతో సౌడు పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో వరి కుప్పపై కవర్కప్పి చెట్టు వైపు వస్తున్న అదే గ్రామానికి చెందిన మరోరైతు రెడ్డబోయిన కొండయ్య(60) కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కొండయ్యను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన పోచయ్యకు భార్య, ఒక కొడుకు ఉన్నాడు.
20 క్వింటాళ్ల వడ్లు కొట్టుకుపోయినయ్
ఈసారి ఆరు ఎకరాల్లో వరి వేసిన. 4 రోజుల క్రితం మూడెకరాలు కోసి పల్వంచలోని కొనుగోలు సెంటర్‌కు తెచ్చిన. మాయిశ్చర్ రావద్దంటే వడ్లు ఎండబోసినం. వానకు 20 క్వింటాళ్ల వడ్లు నీళ్లలో కలిసిపోయినయ్. సెంటర్‌కు వచ్చిన వడ్లను కాంటా పెట్టకపోవడంతో నష్టం జరిగింది.
- సింగిరెడ్డి వెంకట్రాంరెడ్డి, రైతు, పల్వంచ, కామారెడ్డి జిల్లా
వడ్లు తెచ్చి పది రోజులైనా కాంటా పెట్టలే..
నేను రెండెకరాల్లో వరి వేసిన. వడ్లు సెంటర్ల పోసి పది రోజులాయె. మాయిశ్చర్ రాలేదని కాంటా పెట్టలే. పగలు ఆరబోసుడు, రాత్రి కుప్పలు పోసుడు అయితుంది. నిన్నటి వానకు వడ్లు మొత్తం తడిసినయి. రెక్కల కష్టం నీళ్లపాలైంది. ఇప్పుడు తడిసిన వడ్లను కొనేందుకు మళ్లీ మిల్లర్లు కొర్రీలు పెడుతరు.
- మురళి, టీకనపల్లి, మంచిర్యాల జిల్లా
టైమ్‌కు కొంటే ఇట్ల కాకపోవు
25 రోజుల కింద పొలం కోసినం. 20 రోజుల పాటు ఆరబోసినం. వడ్లు కొన్ని మచ్చుకు తీసుకచ్చి మాయిశ్చర్ చూపిస్తే కరెక్టే వచ్చింది. సెంటర్ కు తీసుకొచ్చి కూడా ఐదు రోజులైంతంది. వర్షానికి కల్లంలో నీళ్లు నిలిచి వడ్లు తడిసినయి. ఇన్ని రోజులు కాంటాలు పెడితే మాకీ కష్టాలు ఉండకపోవు. మళ్లీ మాయిశ్చర్ రావాలంటే ఎన్ని రోజులు ఆరబోయాలో తెలియట్లే. వడ్లు పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం మరో ఎత్తు అయితాంది.
- ఎగుర్ల శంకర్, దుర్షేడ్, కరీంనగర్