హిమాచల్ను వీడని వరుణుడు.. 38 రోజుల్లో 20.32 సెం.మీ. వాన.. ఇప్పటి వరకూ 80 మంది మృతి

హిమాచల్ను వీడని వరుణుడు.. 38 రోజుల్లో 20.32 సెం.మీ. వాన.. ఇప్పటి వరకూ 80 మంది మృతి
  • 7 జిల్లాలకు వరద ముప్పు
  • ముందుజాగ్రత్త చర్యగా 225 రోడ్లు బంద్
  • మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీలోనూ దంచికొట్టిన వానలు 

సిమ్లా/కోల్​కతా/న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్​ను వరుణుడు వదలడం లేదు. సోమవారం (జులై 07) సాయంత్రం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. గోహర్​లో 8 సెం.మీ., సరహన్​లో 8.45, బైజ్​నాథ్​లో 6, నహన్ లో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వచ్చే 24 గంటల్లో ఏడు జిల్లాలకు వరదల ముప్పు పొంచి ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. 

అలాగే మిగతా జిల్లాలకు వచ్చే సోమవారం వరకు యెల్లో అలర్ట్  జారీ చేసింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా మొత్తం 225 రోడ్లను బంద్  చేశారు. గత నెల 1 నుంచి ఈ నెల 8 వరకు రాష్ట్రంలో 20.32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం 15.26 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వానలు పడ్డాయి. మండిలో రికార్డు స్థాయిలో 110% అధికంగా వానలు కురిశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ భారీ వర్షాల కారణంగా 80 మంది చనిపోయారు. ఇక మండి జిల్లాలో గల్లంతయిన 
28 మంది కోసం గాలింపు కొనసాగుతోంది.

మహారాష్ట్రలోనూ రికాంలేని వర్షాలు

మహారాష్ట్రలోనూ రికాం లేకుండా వర్షాలు పడుతున్నాయి. గోండియా, భండారా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం వానలు దంచికొట్టాయి. దీంతో రోడ్ల నిండా వరద చేరింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 24 గంటల్లో భండారాలోని లఖందూర్  తహసీల్ లో 16.47, పావోనిలో 15.51, తుమ్సర్ లో 14.76 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

భండారాలోని వైన్ గంగా నది డేంజర్  మార్కు దాటింది. నదులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు. అలాగే.. అస్సాం, మధ్యప్రదేశ్ లోనూ నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని, స్థానిక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

తడిసి ముద్దయిన కోల్ కతా

దక్షిణ బెంగాల్ లోనూ మంగళవారం వానలు దంచికొట్టాయి. భారీ వర్షాలతో రాజధాని కోల్ కతా తడిసి ముద్దయింది. చాలా చోట్ల రోడ్లపై మోకాలిలోతు నీరు చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బుధవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే కురిసే చాన్స్  ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇక ఢిల్లీలో కూడా మంగళవారం ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఢిల్లీలో ఈ వారమంతా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యెల్లో అలర్ట్  జారీ చేసింది.