ఇలాగే ఉంటే చేన్లు చెడిపోవుడే

ఇలాగే ఉంటే చేన్లు చెడిపోవుడే
  • వానల్లేక వాడిపోతున్న పంటలు
  • రెండు వారాలుగా చినుకు లేదు.. 
  • మరో వారం రోజులు ఇలాగే ఉంటే చేన్లు చెడిపోవుడే..

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు : ఉమ్మడి మెదక్​ జిల్లాలో పోయిన నెలలో వానలు దంచి కొట్టి పంటలు నీట మునుగగా, ఇప్పుడు వానలు పడక పత్తి, మొక్కజొన్న, కంది, తదితర పంటలు వాడిపోతున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే పాడవుతుంటే రైతులు అల్లాడిపోతున్నారు. ఈ వానాకాలం సీజన్​లో మెదక్​ జిల్లా వ్యాప్తంగా 48,257 ఎకరాల్లో పత్తి, 5,250 ఎకరాల్లో మొక్కజొన్న, 4,572 ఎకరాల్లో కంది, 1,590 ఎకరాల్లో పెసర, 405 ఎకరాల్లో జొన్న, 763 ఎకరాల్లో మినుము సాగు చేశారు. సిద్దిపేట జిల్లాలో పత్తి 1.10 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 40 వేల ఎకరాల్లో, కంది 1‌‌‌‌‌‌‌‌0 వేల  ఎకరాల్లో సాగైంది. సంగారెడ్డి జిల్లాలో 3.99 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. గత నెలలో  భారీ వర్షాలు పడి వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లితే, ఇప్పుడు వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి.  

15 రోజులుగా చినుకు పడలే.. 

వివిధ పంటలకు 10  నుంచి 15 రోజులకు ఒకసారి నీటి తడి అవసరం. అయితే 15 రోజులుగా జిల్లాలో వర్షాలు కురవకపోడంతో పత్తి, మొక్కజొన్న, కంది చేన్లు వాడిపోతున్నాయి. పత్తి పూత దశలో, మొక్కజొన్న పీప దశలో ఉండగా, కీలకమైన ఈ తరుణంలో నీటి తడులు అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. మరో వారం రోజులు వానలు పడకుంటే పంటలు చేతికి రాకుండా పోతాయని ఆందోళన చెందుతున్నారు. 

మొక్కజొన్న వాడుతోంది.. 


మూడెకరాల్లో మొక్కజొన్న పంట వేసినం. 20 రోజులుగా వానలు పడ్తలేవు. దీంతో పంటంతా వాడిపోతోంది. పెట్టుబడి మస్తు పెట్టినం. దిక్కుతోస్తలేదు.
-

యాదమ్మ, రైతు, బచ్చురాజ్ పల్లి.

ఇంకొన్ని రోజులు వానలు పడకపోతే అంతే..  


పంట ఎండుతుంటే మస్తు బాధైతోంది.  ఎకరన్నరలో మొక్కజొన్న పంట వేస్తే అంతా వాడుముఖం పట్టింది.  ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే మస్తు నష్టపోతాం. 


- నరేశ్, రైతు, బచ్చురాజ్ పల్లి