వానాకాలం సాగు.. 12 లక్షల ఎకరాలు తగ్గింది

వానాకాలం సాగు.. 12 లక్షల ఎకరాలు తగ్గింది

 

  • వానాకాలం సాగు.. 12 లక్షల ఎకరాలు తగ్గింది
  • ఈసారి కోటి 24 లక్షల ఎకరాల్లోనే సాగైన పంటలు
  • నిరుడు కోటి 36 లక్షల ఎకరాల్లో సాగుచేసిన రైతులు
  • పత్తితో పాటు మిగతా  పంటలు తగ్గినయ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు : ఈసారి వానాకాలం పంటలపై ప్రకృతి విపత్తులు ప్రభావం చూపడంతో నిరుడు కంటే 12 లక్షల ఎకరాలకు పైగా పంటల సాగు తగ్గింది. నిరుడు వానాకాలం పంటలన్నీ కలిపి కోటి 36 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఈ యేడు కోటిన్నర లక్షల ఎకరాల టార్గెట్‌‌లో ఇప్పటి వరకు కోటి 24 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. వానాకాలం సాగు గడువు దాదాపు ముగిసింది. ఈ సీజన్‌‌లో జులైలో అధిక వర్షాలు, వరదలతో పంటలు ఆగం కాగా, ఆగస్టు నెలలో అసలు వర్షాలే లేక కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా అతివృష్టి, అనావృష్టి కారణంగా వానాకాలం సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫలితంగా సాగు గణనీయంగా తగ్గింది. 

పడిపోయిన పత్తి..

వానాకాలం సీజన్​లో అన్ని పంటల కంటే పత్తి సాగే అగ్రస్థానంలో ఉంటుంది. కానీ, ఈ సీజన్‌‌లో 65 లక్షల నుంచి 70 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయాలని వ్యవసాయ శాఖ టార్గెట్‌‌ గా పెట్టుకోగా.. 45.03 లక్షల ఎకరాల్లోనే సాగైంది. నిరుడు 49.96 లక్షల  ఎకరాల్లో పత్తి సాగైంది. ఆ శాఖ టార్గెట్‌‌తో పోల్చుకుంటే  దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల భారీ తగ్గుదల నమోదైంది. గత రెండు మూడేండ్లతో పోల్చుకున్నా సాగు భారీగా  పడిపోయింది. జూన్ లో లోటు వర్షపాతంతో పత్తి విత్తనాలు మొలకెత్తక పోగా,  జులైలో అధిక వర్షాలతో మొలకెత్తిన పత్తి వరద ముంపునకు గురైంది. ఆగస్టులో నీటి ఎద్దడి ఎఫెక్ట్‌‌తో సాగైన పంట దెబ్బతిన్నది. దిగుబడిపై కూడా ప్రభావం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మిగతా  పంటలూ అంతంతే..

ఈ సీజన్‌‌లో మక్కలు 5.43 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. మక్కలు కాత పూత టైమ్ లో వర్షాలు పడగా, పంట ఎదగక  దిగుబడి మెరుగ్గా లేదని రైతులు వాపోతున్నరు. జొన్న కేవలం 30 వేల 999 ఎకరాలకే పరిమితమైంది. కంది  4.73 లక్షల ఎకరాలు, పెసలు 55 వేలు, మినుములు 20 వేలు, ఉలువలు 241 ఎకరాల్లోనే సాగయ్యాయి.  వేరు శనగ కేవలం 15 వేల ఎకరాలు, నువ్వులు 289, పొద్దు తిరుగుడు 17 వేలు, ఆముదం 3 వేల 906 ఎకరాల్లో మాత్రమే వేశారు. సోయా మాత్రం కొంత మెరుగ్గా ఈయేడు 4.67 లక్షల ఎకరాల్లో సాగైంది. 

వరి పెరిగినా తప్పని వర్రీ..

రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలంలో 65 లక్షల 873 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. లేటుగా వర్షాలు పడడంతో గత్యంతరం లేక రైతులంతా వరి సాగుకు మొగ్గు చూపారు. జులైలో కురిసిన వర్షాలతో రైతులు పెద్దఎత్తున వరినాట్లు వేశారు. నిరుడు 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈ యేడు అదనంగా 50 వేల ఎకరాలకు పైగా నాట్లు పడ్డాయి.  సీజన్‌‌ వెనక్కి కావడంతో చీడ పీడలు ఆశించడం పెరిగింది. మొన్నటి వరకు వర్షాలు లేక, నీరు సరిగా అందక  పంట ఆశించినంతగా ఎదగలేదని రైతులు అంటున్నారు.  సాగైన పంటకు నీళ్లు పారించడానికి నానా కష్టాలు పడుతున్నామని, దిగుబడి ఎంత వస్తదోనని ఆందోళనలో ఉన్నామని రైతులు పేర్కొంటున్నారు.