
సిగరెట్, తంబాకు, బీడీ, గుట్కా... ప్రాణాలు తీస్తాయని తెలిసినా చాలామంది మానేయరు. ఈ చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెప్పినా కూడా వినరు. అలాంటి వాళ్లచేత సిగరెట్, తంబాకు మాన్పిస్తున్నాడు మాచన రఘునందన్. మహబూబ్‌నగర్ జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్లో డిప్యూటి తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆయన ‘గివ్ అప్ టొబాకో‘ అని గొంతెత్తి చెబుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన రఘునందన్ ఊరు మేడ్చల్ జిల్లా కేశవరం. ఇతను ‘క్విట్ టిబాకో’ నినాదం ఎత్తుకోవడానికి ఓ కారణముంది. రఘునందన్ ఇంటర్మీడియెట్ ఫ్రెండ్ దీక్షితులుకు సిగరెట్ అలవాటు ఉండేది. ఆ అలవాటు ఆఖరుకి అతడి ప్రాణం తీసింది. స్నేహితుడి మరణం రఘునందన్‌ను ఆలోచనల్లో పడేసింది. ఫ్రెండ్ లెక్కనే ఎంతోమంది జీవితాలు టొబాకోకు బలికావద్దనుకున్నాడు. అటు ఉద్యోగం చేస్తూనే పొగాకు అలవాటున్న వాళ్లను ఆ వ్యసనం నుంచి బయటపడేస్తున్నాడు.
ఎలా మాన్పిస్తాడంటే
బస్టాండ్, రోడ్డుమీద ఎవరైనా బీడీ, సిగరెట్ తాగుతూ, తంబాకు, గుట్కా నములుతూ రఘునందన్‌కు కనిపిస్తే వెంటనే వాళ్ల దగ్గరకు వెళతాడు. వాళ్లకు పండ్లు, కర్చీఫ్ ఇస్తాడు. ఆ అలవాటు మానేయాలని చెప్తాడు. ‘వీటికోసం రోజుకు ఎన్ని పైసలు ఖర్చు పెడతవో, వాటిని ఒక పక్కకు పెట్టు. వారం, నెల తిరిగే సరికి ఎన్ని పైసలు జమైతయో చూడు. సిగరెట్ మీదకు మనసు గుంజితే ఒక పేపర్ మీద నీ పేరు లేదా నీ ఇష్టదైవం పేరు రాయి. అప్పుడు నీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సిగరెట్ తాగాలనే ఆలోచన ఇక రాదు’ అని చెబుతాడు. అంతేకాకుండా ఆడపిల్లలకు ‘అమ్మా! సిగరెట్ లేదా పొగాకు అలవాటున్న మీ అన్నకు, తమ్ముడికి ఈ సారి రాఖీ కట్టేటప్పుడు వాళ్లను ఆ అలవాటు మానుకోవాలని చెప్పు. వాటికయ్యే ఖర్చులో నాకు ఒక చీర కొనివ్వండి’ అని అడుగు అని చెప్తాడు. అతడి ఆలోచన చాలా గొప్పగా పనిచేసింది. చాలామంది అతడికి ఫోన్ చేసి ‘అన్నా! నువ్వు చెప్పిన మాటలు బాగా పనిచేశాయి. నేనిప్పుడు సిగరెట్, పొగాకు మానేశాను’అని చెబుతుంటారు.
మూడు రోజుల్లో 2,020 మెసేజ్‌లు
కిందటి ఏడాది డిసెంబర్ 29,30,31 తారీఖుల్లో మూడు రోజుల్లోనే ప్రపంచ దేశాలన్నింటికీ ‘సే గుడ్ బై టు టొబాకో’అని 2,020 మెసేజ్‌లు పంపాడు. గత పదేళ్లుగా పొగాకు లేని సమాజం కోసం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అతడి ట్యాగ్‌లను చూసి చండీగఢ్‌లోని ‘రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్’ వాళ్లు కొత్తగా మొదలెట్టిన మూడునెలల ‘టొబాకో బేసిక్ కోర్స్’ లో చేరాల్సిందిగా రఘునందన్‌ను కోరారు. - సంతోష్ బొందుగుల
ఇది నా బాధ్యత
‘‘మా నాన్న అభిమన్యు టీచర్. ఆయన పెంపకం వల్లనే నేను ఏ వ్యసనాల జోలికి పోలేదు. పొగాకు ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా కొందరు సిగరెట్ తాగుతారు. అలాంటి వాళ్లతో మాట్లాడి, వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి మాన్పించేవాడిని” అంటున్నాడు రఘునందన్. ‘ఎందుకు నీకీ శ్రమ’అని ఎవరైనా అడిగితే ‘ప్రజలు కట్టిన పన్నుతో జీతం తీసుకుంటున్నా. అందుకే నేనీ పని చేస్తున్నా.’’ - మాచన రఘునందన్