
- ఎంఎన్ఎస్ కార్యకర్తలను వెనకేసుకువ చ్చిన రాజ్ థాకరే
ముంబై: మరాఠీ భాషను రక్షించుకోవడం కోసం, మాతృ భాషను అవమానించిన వారిపట్ల తన సైనికులు కఠినంగా ఉంటున్నారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే చెప్పారు. గురువారం ఓ మార్వాడీ దుకాణదారుడిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆయన సమర్థించారు. మరాఠీ భాషను అవమానించడం వల్లే ఈ దాడి జరిగిందని చెప్పారు.
భాషను, సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి వారిపై కార్యకర్తలు దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇది మరాఠీ పట్ల వారికి ఉన్న ప్రేమను చాటిచెబుతుందన్నారు. ముంబైలోని విఖ్రోలీలో గురువారం ఒక మార్వాడీ దుకాణదారుడిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై రాజ్ థాకరే స్పందించారు.
ఆ దుకాణదారుడు మరాఠీ సమాజాన్ని అవమానించేలా వాట్సాప్ స్టేటస్ పెట్టాడని అన్నారు. అతడికి బుద్ధి చెప్పేందుకే తన సైనికులు చేయ్యెత్తాల్సి వచ్చిందని.. ఆ వ్యాపారితో క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేశారని వివరించారు. ఈ దాడిని మరాఠీ భాషపై ఉన్న ప్రేమ నుంచి పుట్టుకొచ్చిన ఒక సముచిత స్పందనగా వివరించారు.
మా మహారాష్ట్రకు ఏమైంది?
గురువారం విధాన్ భవన్‌లో బీజేపీ, ఎన్సీపీ (శరద్ పవార్) ఎమ్మెల్యేల మధ్య జరిగిన గొడవను రాజ్‌థాకరే ప్రస్తావించారు. ఆ గొడవపై చాలా ఆందోళన చెందుతున్నారని.. మరాఠీ భాషను అవమానించే ఘటనలపై ఎందుకు ఆందోళన చెందడంలేదని ప్రశ్నించారు. ‘‘మా మహారాష్ట్రకు ఏమైంది? మరాఠీ ప్రజలు తమ రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టారు?” అని అన్నారు.
‘‘మరాఠీ భాష, మరాఠీ ప్రజల కోసం నా సైనికులు చేయి ఎత్తితే.. వారిపై, మా పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసిన వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు?” అని ప్రశ్నించారు. ఈ దాడులను మరాఠీ భాష, సంస్కృతి పేరిట ఎంఎన్ఎస్ పాల్పడుతున్న హింసాత్మక చర్యలుగా పలువురు ఆరోపిస్తున్నారు. మరాఠీ మాట్లాడలేదని ఇటీవల పాల్ఘర్‌లో ఒక ఆటో డ్రైవర్‌ను, అంతకుముందు థానేలో ఒక వ్యాపారిని శివసేన(యూబీటీ), ఎంఎన్ఎస్ కార్యకర్తలు కొట్టిన సంగతి తెలిసిందే.