పరిహారం చెల్లించేదాకా నిర్వాసితుల తరఫున పోరాడుతా

పరిహారం చెల్లించేదాకా నిర్వాసితుల తరఫున పోరాడుతా

మునుగోడు (మర్రిగూడ), వెలుగు: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం, లక్ష్మణపురం రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డిమాండ్​చేశారు. ఆర్ అండ్​ఆర్ ప్యాకేజీ కింద రూ. 15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేదాకా నిర్వాసితుల తరఫున పోరాడుతానన్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన చర్లగూడెం, కిష్టరాయన్​పల్లి నిర్వాసితులు మర్రిగూడలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు గురువారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో కూర్చున్న వారి ఆరోగ్యం క్షీణించడంతో గురువారం గ్రామస్తులు పెద్దసంఖ్యలో శిబిరం వద్దకు చేరుకొని.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అక్కడికి చేరుకొని దీక్షలోని వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులతో కలిసి చౌరస్తాలో ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిండి నిర్వాసితులకు న్యాయం చేయాలని తాను అసెంబ్లీలో ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘‘భూములు కోల్పోయిన వారికి భూములు, ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల నుంచి భూములను గుంజుకోవడం సరైన పద్ధతి కాదు. నిర్వాసితుల గోస రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా? నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా” అని అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. పదవుల మీద ఆశ ఉంటే ఎమ్మెల్యే పదవిని ఎందుకు వదులుకుంటానని ప్రశ్నించారు. కుటుంబ పాలనను అంతం చేసి, ప్రజాస్వామ్య పాలన  తేవాలని, ప్రజల సమస్యలు తీర్చాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేశానని చెప్పారు. బై ఎలక్షన్​ తన కోసం రాలేదని, మునుగోడు ప్రజల కోసమే వచ్చిందని, కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. 

ఇచ్చిన హామీలు అమలు చేయాలి: కోదండరాం

డిండి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్​ అమలు చేయాలని టీజేఎస్​ చీఫ్​ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. మర్రిగూడ చౌరస్తాలో కిష్టరాయన్ పల్లి, చర్లగూడెం భూ నిర్వాసితులు చేస్తున్న ఆమరణ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్వాసితులకు జీవనోపాధి చూపించాకే ప్రాజెక్టు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్​ అమలుచేయకపోవడం దురదృష్టకరమన్నారు. ‘నిర్వాసితులకు భూమికి బదులు భూమి, ఇంటికో ఉద్యోగం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, కోరుకున్నచోట ఇంటి స్థలం ఇవ్వాలి” అని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో భూనిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.