రాజమండ్రి  నుంచి అన్ని ప్రాంతాలకు ఎయిర్​ పోర్ట్​ కనెక్టివిటీ..

రాజమండ్రి  నుంచి అన్ని ప్రాంతాలకు ఎయిర్​ పోర్ట్​ కనెక్టివిటీ..

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శ్రీకారం చుట్టారు. రాజమండ్రి విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన మహోత్సవానికి రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్, రాజమండ్రి ఎంపీ భరత్‌ రామ్ హాజరయ్యారు. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులను ఎయిర్ పోర్టు అథారిటీ చేపట్టింది. ముందుచూపుతో అన్ని ప్రాంతాలకు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. పాత ఎయిర్పోర్టుల అభివృద్ధి, కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి రూ.347 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం శుభపరిణామమని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలోని ఆరు ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. త్వరలో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం చేస్తామన్నారు. 

రాజమండ్రితో పాటు రాష్ట్రంలోని ఆరు ఏర్పాట్ల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎయిర్ పోర్టుల ద్వారా కనెక్టివిటీ పెంచడం ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ లైన్స్ అభివృద్ధి వేగవంతం చేశారన్నారు. 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 12 కస్టమ్ ఎయిర్ ఫోర్సు, 98 డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులు సహా 133 ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాలకు ప్రతివారం 126 విమాన సర్వీసులు నడుపుతున్నామన్నారు. త్వరలో ఢిల్లీ, గోవా, ముంబయి తదితర ముఖ్య ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుపుతామన్నారు. త్వరలో కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యను కేంద్రం విరమించుకోవాలన్నారు.