ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇదే: రాజమౌళి

 ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇదే: రాజమౌళి

రాజమౌళి-రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీని వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదల కానుంది. దర్శకధీరుడు రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో విడుదల తేదీ జనవరి 7 అంటూ ప్రకటించి కొత్త పోస్టర్ ను ట్యాగ్ చేయడంతో విడుదల తేదీపై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. గతంలో నిర్ణయించిన మేరకు అక్టోబర్ 13న విడుదల కావాల్సి ఉండగా... రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. పోస్టు ప్రొడక్షన్ పనులు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా ఇబ్బందులు పెద్దగా లేకున్నా.. నిర్మాణానంతర కార్యక్రమాలు హడావుడిగా చేస్తే క్వాలిటీ ఉండదన్న అభిప్రాయంతో వాయిదా వేయడానికే సినిమా యూనిట్ మొగ్గు చూపింది.

డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ వెటరన్ హీరో అజయ్ దేవగణ్, బాలీవుడ్ అగ్రతార అలియాభట్ తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలీవియో మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్ తదితరులు నటించనున్న ఈ భారీ మూవీకి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన నేపధ్యంలో ఆయన మరో చారిత్రక కథాంశాన్ని తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.