Rajamouli: రాజమౌళి ఫాల్కే బయోపిక్‌కు హీరోల కొరత: ఎన్టీఆర్-ప్రభాస్ వల్లే ప్రాజెక్టుకు బ్రేక్..!

Rajamouli: రాజమౌళి ఫాల్కే బయోపిక్‌కు హీరోల కొరత: ఎన్టీఆర్-ప్రభాస్ వల్లే ప్రాజెక్టుకు బ్రేక్..!

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న  ప్రతిష్టాత్మక బయోపిక్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యంలో, దర్శకుడు నితిన్ కక్కర్ రూపొందిస్తున్నారు. అయితే హీరోల బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్  వెనుకబడింది. మరోవైపు, ఇదే అంశంపై బాలీవుడ్ అగ్ర నటుడు ఆమిర్ ఖాన్ , దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కలిసి చేస్తున్న చిత్రం షూటింగ్  పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో రాజమౌళి టీమ్ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది.

సతమతమవుతున్న చిత్ర యూనిట్

నితిన్ కక్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్‌లో మొదట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంది. అయితే ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు దేవరా2  వంటి భారీ ప్రాజెక్టులతో ఎన్టీఆర్ షెడ్యూల్ నిండిపోయింది. ఈ బయోపిక్ సినిమాను ఆలస్యం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో మేకర్స్ దృష్టి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై పడింది.

అయితే, ప్రభాస్ కూడా 2027  వరకు విపరీతమైన బిజీగా ఉన్నారు.  ప్రభాస్ త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత, నాగ్ అశ్విన్ తీస్తున్న 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2' కోసం సిద్ధం కానున్నారు. ఇలా, వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు క్యూ కట్టడంతో, ఫాల్కే బయోపిక్‌కు తగినంత సమయం దొరకడం కష్టంగా మారింది. అంతే కాదు త్వరలోనే ' ది రాజా సాబ్' మూవీకూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది.

ALSO READ :  'రీల్స్ కట్ చేస్తాం బిడ్డా' అన్న విష్ణుమూర్తి ఇక లేరు

నితిన్ కక్కర్ కొత్త ప్రాజెక్ట్ వైపు మొగ్గు

ముఖ్య నటుల నుంచి గ్రీన్ సిగ్నల్ ఆలస్యం అవుతుండటంతో, దర్శకుడు నితిన్ కక్కర్ ఈ బయోపిక్ ప్రాజెక్ట్ కోసం వేచి చూడకుండా, తన దృష్టిని మరొక సినిమా వైపు మళ్లించారు. ప్రస్తుతం ఆయన ఇమ్రాన్ హష్మి, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'అవారాపన్ 2' (Awarapan 2) సీక్వెల్ షూటింగ్‌ను థాయిలాండ్‌లో చురుగ్గా జరుపుతున్నారు. ఫాల్కే ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయే వరకు ఖాళీగా ఉండటం ఇష్టం లేక నితిన్ కక్కర్ 'అవారాపన్ 2' తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సరైన స్టార్ దొరికినప్పుడే ఈ బయోపిక్‌ను మళ్లీ పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల అభ్యంతరాలు

ముఖ్య నటుల షెడ్యూల్ సమస్యలతో పాటు, ఈ ప్రాజెక్ట్‌కు మరో అడ్డంకి కూడా ఎదురైంది. దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసాల్కర్, రాజమౌళి టీం చేస్తున్న బయోపిక్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజమౌళి గానీ, ఆయన బృందం గానీ తమను సంప్రదించకుండా సినిమా తీయడం సరికాదని ఆయన మీడియాకు తెలిపారు. ఫాల్కే గారిపై సినిమా తీయాలంటే, కనీసం కుటుంబాన్ని సంప్రదించాలి. నిజమైన కథలు మాకు మాత్రమే తెలుసు, కుటుంబాన్ని విస్మరించకూడదు అని పుసాల్కర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయితే, ఆయన ఆమిర్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరానీ కలిసి చేస్తున్న ఫాల్కే బయోపిక్‌కు మాత్రం మద్దతు పలికారు. ఆమిర్ ఖాన్ టీమ్ గత మూడేళ్లుగా తమతో సంప్రదింపులు జరుపుతూ, సరైన రీసెర్చ్ చేస్తోందని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో, సరైన హీరో, కుటుంబ సభ్యుల సహకారం లభించిన తర్వాతే రాజమౌళి బృందం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలపై ఎక్కుతుందో చూడాలి మరి.