
- జిల్లాలో 42 సోలార్ యూనిట్స్ ఏర్పాటు.. ప్రాసెస్‌లో మరో 50 యూనిట్లు
- తంగళ్లపల్లి టెక్స్‌టైల్స్ పార్క్‌లో, సెస్ ఆధ్వర్యంలో ఇప్పటికే సోలార్ ప్లాంట్లు
- పీఎం సూర్య ఘర్ ముఫ్బిజిలీ యోజన ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.78వేల సబ్సిడీ
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తికి జనం ముందుకు వస్తున్నారు. బిల్డింగ్‌ల మీద, ఖాళీ స్థలాల్లో ప్యానళ్లు ఏర్పాటు చేసుకొని గృహ, పవర్‌లూమ్ మిల్లులకు వినియోగించుకునేందుకు కరెంట్ ఉత్పత్తికి రెడీ అవుతున్నారు. సోలార్ కరెంట్ ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో జిల్లావాసులు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన ద్వారా సోలార్యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ స్కీములో భాగంగా 1 కిలో వాట్ నుంచి 3 కిలోవాట్ల వరకు ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.30వేల నుంచి రూ.78వేల వరకు సబ్సిడీ అందుతుండగా.. మిగతాది బ్యాంకు నుంచి లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ లోన్‌ను పదేండ్లలో చెల్లించుకునేందుకు సౌకర్యం ఉంది.
సిరిసిల్లలో 42 సోలార్ యూనిట్లు
సిరిసిల్లలో పీఎం సూర్యఘర్ ముఫ్ బిజిలీ పథకంలో భాగంగా ఇంటిపై సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు 92 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటికే 42 మందికి సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోగా.. మరో 50 ప్రాసెస్ లో ఉన్నాయి. ఒక కిలో వాట్‌కు 120 యూనిట్లు, అదే 2 కిలోవాట్‌కు 220 నుంచి 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. సోలార్ ద్వారా ఉత్పత్తఅయిన కరెంట్‌ను ఇంటి అవసరాలకు వాడుకోగా.. మిగిలిన కరెంట్‌ను నెట్ మీటరింగ్ ద్వారా సెస్‌కు అమ్ముకోవచ్చు. ఇందుకు యూనిట్‌కు రూ.5 చొప్పున చెల్లిస్తుంది. దీంతో తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేయడంతోపాటు కరెంట్ బిల్లులను కూడా ఆదా చేసుకుంటున్నారు.
టెక్స్‌టైల్స్ పార్క్, సెస్ ఆధ్వర్యంలో..
సిరిసిల్లలో నేతకార్మికులు, ఆసాములు పవర్‌లూమ్స్ నడిపేందుకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్ టైల్ పార్క్‌లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. అమర్చుకున్నారు. దాదాపు 10 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో పాటు సెస్ ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మండెపల్లి శివారులో 440 యూనిట్లతో సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
సాగు యోగ్యం కాని భూముల్లోనూ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసి కరెంట్ ఉత్పత్తి చేసి సబ్‌స్టేషన్లకు అనుసంధానిస్తున్నారు. ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో 150 ఎకరాల్లో, పెద్దలింగాపూర్ లో 120 ఎకరాలు, వేములవాడ మండలం నూకలమర్రిలో 100 ఎకరాలు, ముస్తాబాద్ మండలం నామాపూర్ లో 200 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 55 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని సెస్ అధికారులు
చెప్తున్నారు.
షాపింగ్ మాల్‌పై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న..
షాపింగ్ మాల్‌లో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. నేను నా షాపింగ్‌మాల్‌పై 40 సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నా. దీని ద్వారా దాదాపు 35 శాతం కరెంట్ బిల్లులు తగ్గాయి. సోలార్ ప్యానెల్స్‌కు మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు. - రాజూరి వంశీ, రాధామాధవ్ షాపింగ్ మాల్ నిర్వాహకుడు
సోలార్ యూనిట్లకు సబ్సిడీ
ఇండ్ల పైకప్పులు, బిల్డింగ్‌లపై సోలార్ యూనిట్లు ఏర్పాటు కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాలో సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 42 యూనిట్లు ఏర్పాటు చేశాం. మరికొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి. సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని కరెంట్ బిల్లులను ఆదా చేసుకోవచ్చు.
- మునీందర్‌రెడ్డి, రెడ్ కో మేనేజర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా