నయనతార అన్నపూరణి మూవీపై రాజాసింగ్ ఆగ్రహం

నయనతార అన్నపూరణి మూవీపై రాజాసింగ్ ఆగ్రహం

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) నటించిన అన్నపూరణి(Annapoorani) మూవీ వివాదం రోజురోజుకి దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెద్దఎత్తున కేసులు నమోదైయ్యాయి. సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని, సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ నుండి తొలగించిన ఆ సంస్థ.. క్షమాపణలు కోరుతున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇక తాజాగా అన్నపూరణి సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ భాజాపా ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh). అన్నపూరణి లాంటి సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్ సంస్థపై కూడా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వివాదం గురించి ఆయన మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలు తీస్తే సహించేదిలేదు. ఈ సినిమా విషయంలో జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని తెలిసింది. కానీ.. సారీ చెప్పినంత మాత్రాన ఈ సమస్య ముగిసినట్టు కాదు. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్ సంస్థపై పూర్తి నిషేధం విధించాలి. అంతేకాదు.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకుడు, నిర్మాతలు, నటీనటులపై కూడా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుకుంటున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు రాజాసింగ్.