పిల్లలు చచ్చిపోయిన మీరు మారరా..? రాజస్థాన్‎లో కూలిన మరో ప్రభుత్వ పాఠశాల పైకప్పు

పిల్లలు చచ్చిపోయిన మీరు మారరా..? రాజస్థాన్‎లో కూలిన మరో ప్రభుత్వ పాఠశాల పైకప్పు

జైపూర్: రాజస్తాన్‎లోని పాఠశాలల్లో చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. శుక్రవారం (జూలై 25) ఝలావర్‎లోని పీప్లోడీ ప్రైమరీ స్కూల్​పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతిచెందగా.. మరో 15 మంది  గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే రాజస్థాన్‎లో ఇలాంటి తరహా ప్రమాదం మరొకటి జరిగింది. మరో పాఠశాల భవనం పై కప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  

ALSO READ | 26/7 ముంబై వరదలు: ఇరవైయేళ్ల తరువాత కూడా.. నగరం ఇంకా వరదలకు గురవుతోంది

వివరాల ప్రకారం.. శనివారం (జూలై 26) నాగౌర్ జిల్లాలోని దేగానా ప్రాంతం ఖరియాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సమయంలో పాఠశాలలో విద్యార్థులు ఎవరూ లేరు. పాఠశాల భవనం పై కప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యా శాఖ అధికారులు ప్రమాదంపై ఆరా తీశారు. స్కూల్ ఎప్పుడో జమానాలో నిర్మించింది కావడంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడవడంతోనే స్కూల్ బిల్డింగ్ పై కప్పు కూలిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ పాఠశాల భవనం పై పెచ్చులు కూలినప్పుడు తమ పిల్లలు అందులో ఉంటే పరిస్థితి ఏంటని..? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను నిలదీశారు పిల్లల తల్లిదండ్రులు. ఈ వరుస ఘటనలతో రాజస్థాన్‎లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, భద్రతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.