ఆర్సీబీపై 29 రన్స్ తేడాతో రాజస్థాన్ విక్టరీ

ఆర్సీబీపై 29 రన్స్ తేడాతో రాజస్థాన్ విక్టరీ

లీగ్‌‌ ఆరంభం నుంచి బ్యాటింగ్‌‌తో అద్భుతాలు చేసిన రాజస్తాన్‌‌ రాయల్స్‌‌.. ఈసారి బౌలింగ్‌‌తో తడాఖా చూపెట్టింది..! బ్యాటింగ్‌‌లో రియాన్‌‌ పరాగ్‌‌ (31 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 నాటౌట్‌‌) ఒక్కడే మెరిసినా... స్పిన్నర్‌‌ అశ్విన్‌‌ (3/17), పేసర్‌‌ కుల్దీప్‌‌ సేన్‌‌ (4/20) సూపర్​ బౌలింగ్‌‌తో.. బెంగళూరు పవర్‌‌ హిట్టర్లకు ఈజీగా చెక్‌‌ పెట్టింది..! దీంతో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరో విక్టరీతో టాప్‌‌లోకి దూసుకెళ్లింది..! టార్గెట్‌‌ చిన్నదే అయినా.. ఒత్తిడి జయించలేకపోయిన ఆర్‌‌సీబీ.. నాలుగో ఓటమిని మూటగట్టుకుంది..!!

పుణె: ఐపీఎల్‌‌లో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ జోరు కొనసాగుతున్నది. పెద్ద స్టార్లు లేకపోయినా.. చిన్న ప్లేయర్లతోనే అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నది. తాజాగా బౌలింగ్‌‌ మెరుపులతో మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 29 రన్స్‌‌ తేడాతో రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరుపై నెగ్గింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన రాజస్తాన్‌‌ 20 ఓవర్లలో 144/8 స్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 19.3 ఓవర్లలో 115 రన్స్‌‌కు ఆలౌటైంది. డుప్లెసిస్‌‌ (23) టాప్‌‌ స్కోరర్‌‌. రియాన్‌‌ పరాగ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

పరాగ్‌‌ ఫటాఫట్​..

గత మ్యాచ్‌‌లకు భిన్నంగా ఈసారి రాజస్తాన్‌‌ బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌ విఫలమైంది. టాప్‌‌ ఆర్డర్‌‌ నిరాశపర్చినా... మిడిల్‌‌లో పరాగ్‌‌ మెరిశాడు. స్టార్టింగ్‌‌లో హైదరాబాద్​పేసర్‌‌ సిరాజ్‌‌ (2/30), హేజిల్‌‌వుడ్‌‌ (2/19) కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో బట్లర్‌‌ (8) పవర్‌‌ హిట్టింగ్‌‌ ఈసారి పని చేయలేదు. 11 రన్స్‌‌ వద్ద తొలి వికెట్‌‌ రూపంలో పడిక్కల్‌‌ (7) ఔట్‌‌కాగా, ఫించ్‌‌ హిట్టర్‌‌గా వచ్చిన అశ్విన్‌‌ (17) చకచకా నాలుగు ఫోర్లు బాదాడు. కానీ రెండు బాల్స్‌‌ తేడాలో అశ్విన్‌‌, బట్లర్‌‌ వెనుదిరగడంతో రాజస్తాన్‌‌ 4.1 ఓవర్లలో 33/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌‌ శాంసన్‌‌ (27) మూడు సిక్సర్లతో జోరు చూపెట్టగా.. డారెల్‌‌ మిచెల్‌‌ (16) రెండు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌‌ను ఆదుకున్నాడు. శాంసన్‌‌తో నాలుగో వికెట్‌‌కు 35, పరాగ్‌‌తో ఐదో వికెట్‌‌కు 31 రన్స్‌‌ జోడించి ఔటయ్యాడు. దీంతో రాజస్తాన్‌‌ స్కోరు 15 ఓవర్లలో 100 రన్స్‌‌కు చేరింది. స్లాగ్‌‌ ఓవర్స్‌‌ మొదలైనా రాయల్స్‌‌ బ్యాటింగ్‌‌లో జోరు మాత్రం పెరగలేదు. ఓ ఎండ్‌‌లో వరుస విరామాల్లో హెట్‌‌మయర్‌‌ (3), బౌల్ట్‌‌ (5), ప్రసిధ్‌‌ కృష్ణ (2) పెవిలియన్‌‌కు చేరినా..  చివర్లో పరాగ్‌‌ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదడంతో రాయల్స్‌‌ ఆ మాత్రం స్కోరైనా చేసింది. ఈ క్రమంలో పరాగ్‌‌ 29 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. 

సూపర్‌‌.. బౌలింగ్‌‌

టార్గెట్‌‌ చిన్నదే అయినా.. బెంగళూరుకు ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్‌‌గా వచ్చిన విరాట్‌‌ (9) రెండో ఓవర్‌‌లోనే ఔట్‌‌కాగా, డుప్లెసిస్‌‌ ఉన్నంతసేపు ఫర్వాలేదనిపించాడు. కానీ ఏడో ఓవర్‌‌లో కుల్దీప్‌‌ సేన్‌‌ వరుస బాల్స్‌‌లో డుప్లెసిస్‌‌, మ్యాక్స్‌‌వెల్‌‌ (0)ను పెవిలియన్‌‌కు చేర్చాడు. దీంతో ఆర్‌‌సీబీ 37/3తో ఎదురీత మొదలుపెట్టింది. రజత్‌‌ పటిదార్‌‌ (16)తో కలిసి షాబాజ్‌‌ అహ్మద్‌‌ (17) ఇన్నింగ్స్‌‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ అశ్విన్‌‌  తన వరుస ఓవర్లలో పటిదార్‌‌, ప్రభుదేశాయ్‌‌ (2)ను ఔట్‌‌ చేశాడు. ఫలితంగా పవర్‌‌ప్లేలో 37/1 స్కోరు చేసిన ఆర్‌‌సీబీ 12 ఓవర్లలో 67/5 స్కోరుతో నిలిచింది. ఈ దశలో వచ్చిన దినేశ్‌‌ కార్తీక్‌‌ (6) ఫోర్‌‌తో ఫినిషింగ్‌‌ మొదలుపెట్టేలోపే షాబాజ్‌‌ దెబ్బకు రనౌటయ్యాడు. ఇక షాబాజ్‌‌తో కలిసి హసరంగ (18) ఆట మొదలుపెట్టినా.. రాయల్స్‌‌ బౌలర్లు పట్టు వదల్లేదు. వరుస ఓవర్లలో ఈ ఇద్దర్ని వెనక్కి పంపడంతో ఆర్‌‌సీబీ 102/8 స్కోరుతో వెనుకబడింది. ఇక ఆఖరి 18 బాల్స్‌‌లో 42 రన్స్‌‌ అవసరం కాగా క్రీజులోకి వచ్చిన హర్షల్‌‌ (8), సిరాజ్‌‌ (5), హేజిల్‌‌వుడ్‌‌ (0 నాటౌట్‌‌) లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. ప్రసిధ్‌‌ కృష్ణ 2 వికెట్లు తీశాడు.