
గద్వాల, వెలుగు: రాజస్థాన్ కు చెందిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఎస్పీ ఆఫీస్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈనెల 11న అయిజ మండల కేంద్రంలోని జయలక్ష్మి ఏజెన్సీలో రూ.18 లక్షల విలువైన సిగరెట్లు చోరీ అయ్యాయి. దీనిపై మరుసటి రోజు షాపు ఓనర్ వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా చోరీ చేసిన సరుకును అమ్మేందుకు ఈనెల 21న ఎరిగేర మీదుగా రాయచూర్ బయలుదేరారు. నిందితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు టెక్నికల్ ఆధారాల ద్వారా రాయచూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. సోమవారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వారు రాజస్థాన్‌కు చెందిన రతన్‌లాల్, బీర్బల్ బిష్ణాయ్‌గా గుర్తించారు. మరొకడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. నిందితుల నుంచి సుమారు రూ.15 లక్షల విలువ చేసే సిగరెట్ కాటన్ బాక్సులు, వ్యాన్, రెండు సెల్ ఫోన్లు,ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఎస్ఐ శ్రీనివాసరావు, ఐటీ సెల్ ఎస్‌ఐ సుకుర్, హెడ్ కానిస్టేబుల్ రంజిత్, ప్రసాద్, గోవిందు, రవికుమార్, శ్రీను లను ఎస్పీ అభినందించారు. ప్రెస్ మీట్ లో డీఎస్పీ మొగులయ్య, సీఐ టాటా బాబు పాల్గొన్నారు.