తనను కొట్టారన్న పగతో పొరుగింటోళ్లపై కాల్పులు

తనను కొట్టారన్న పగతో పొరుగింటోళ్లపై కాల్పులు

జైపూర్‌‌‌‌: పొరుగింటి వాళ్లతో జరిగిన చిన్న గొడవ.. ముగ్గురు అన్నదమ్ముల ప్రాణాలను బలితీసుకుంది. రాజస్థాన్‌‌‌‌లోని భరత్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ జిల్లా సిక్రోరా గ్రామంలో జరిగిందీ ఘటన. రాజస్థాన్ ఆర్మ్‌‌‌‌డ్ కానిస్టేబులరీ (ఆర్‌‌‌‌‌‌‌‌ఏసీ)లో కానిస్టేబుల్‌‌‌‌గా గజేంద్ర సింగ్ పని చేస్తున్నారు. ఈయన సోదరులు సమందర్ సింగ్, ఈశ్వర్ సింగ్ కూడా సిక్రోరాలోనే పక్కపక్క ఇండ్లలో ఉంటున్నారు. ‘‘కొన్ని రోజుల కిందట గజేంద్ర సింగ్ కొడుకు టెన్‌‌‌‌పాల్.. పొరుగింట్లో ఉండే లఖన్‌‌‌‌తో గొడవపడ్డాడు. లఖన్‌‌‌‌ను కొట్టాడు. దీనిపై ఊర్లోని పెద్ద మనుషులు కూర్చుని పంచాయితీ చేశారు. కానీ తనను కొట్టిన టెన్‌‌‌‌పాల్‌‌‌‌ ఫ్యామిలీపై లఖన్ పగ పెంచుకున్నాడు. శనివారం రాత్రి 8 నుంచి 10 మందితో గజేంద్ర సింగ్ ఇంట్లోకి వెళ్లాడు. గట్టిగా అరుస్తూ అందరూ గాల్లోకి కాల్పులు జరిపారు.

రూమ్‌‌‌‌లో నుంచి గజేంద్ర బయటికి రాగానే కాల్చి చంపారు. గన్ ఫైరింగ్, అరుపులు విని పక్కింట్లో నుంచి సమందర్, ఈశ్వర్ వచ్చారు. వీరిపైనా దుండగులు కాల్పులు జరపడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాల్పుల్లో గజేంద్ర భార్య, కొడుకు, కోడలికి తీవ్ర గాయాలయ్యాయి’’ అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుమార్ హిమాన్షు సింగ్ వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి 1.30కి తమకి సమాచారం అందిందని చెప్పారు. గాయపడ్డ ముగ్గురిని జైపూర్‌‌‌‌‌‌‌‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని వివరించారు. స్థానిక ఆస్పత్రిలోని మార్చురీకి డెడ్‌‌‌‌బాడీలను తరలించారు. నిందితులను అరెస్టు చేయాలంటూ అక్కడ బాధితుల బంధువులు ధర్నా చేశారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని స్థానిక మంత్రి విశ్వేంద్ర సింగ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రాజస్థాన్‌‌‌‌లోని భరత్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ జిల్లా భుసావర్‌‌‌‌‌‌‌‌లో అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో కూడా చిన్న పాటి గొడవ కారణంగా ముగ్గురు వ్యక్తులను చంపేశారు.