
- రాజస్థాన్‌లో తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్న కొడుకు
- చితిపై పడుకుని రెండు గంటలపాటు గందరగోళం
జైపూర్: నగల కోసం.. కన్న కొడుకే తల్లి అంత్యక్రియలను అడ్డుకున్నాడు. ఆమె ఒంటిపై ఉన్న వెండి కడియాలు తనకే ఇవ్వాలంటూ మొండికేశాడు. లేదంటే తనను కూడా దహనం చేయండంటూ చితిపై పడుకుని నానా గందరగోళం సృష్టించాడు. అలా రెండుగంటలపాటు కుటుంబసభ్యులతో వాదించి దహన సంస్కారాలను అడ్డుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం వైరల్ అయింది. రాజస్థాన్ జైపూర్‌లోని విరాట్‌నగర్‌కు చెందిన భురీ దేవి(80)కి ఏడుగురు కొడుకులు. వీరిలో ఆరుగురు కలిసి ఉంటుండగా చిన్న కొడుకు ఓం ప్రకాశ్ వేరుగా ఉంటున్నాడు. వీళ్ల మధ్య కొన్నేండ్లుగా ఆస్తి వివాదాలున్నాయి.
ఈ నెల 3న భురీదేవి అనారోగ్యంతో చనిపోయాక కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఆమె ఒంటిపై ఉన్న నగలు, వెండి కడియాలు తీసి పెద్ద కొడుక్కు అప్పగించారు. ఇది ఓం ప్రకాశ్‌కు కోపం తెప్పించింది. అంతిమయాత్ర శ్మశానం వరకూ వెళ్లాక పెద్దలు చితి పేర్చుతుండగా ఓంప్రకాశ్ వాగ్వాదానికి దిగాడు. ఆ వెండి కడియాలు తనకే ఇవ్వాలని, ఇచ్చేదాకా అంత్యక్రియలు కూడా జరిపేదిలేదని పట్టుబట్టాడు. అంతటితో ఆగకుండా అదే చితిపై పడుకుని దహన సంస్కారాలను అడ్డుకున్నాడు. ఇంక చేసేదేంలేక ఇంటి నుంచి ఆ వెండి కడియాలు తెప్పించి ఓ ప్రకాశ్‌కు అందజేశారు. ఆ తర్వాత ఓం ప్రకాశ్ చితిపై నుంచి లేచి అంత్యక్రియలకు అడ్డుతొలిగాడు. అంతిమ సంస్కారాలను అపవిత్రం చేశారంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.