
రాజస్తాన్ లోని కరౌలీ జిల్లాలో దారుణం జరిగింది. ఓ స్థలానికి సంబంధించి జరిగిన గొడవలో బాబూలాల్ వైష్ణవ్ అనే 50 ఏళ్ళ పూజారిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు కొందరు దుండగులు. బుధవారం జరిగిన ఈ గొడవలో.. రాధాకృష్ణ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న పూజారి కాలిన గాయాలతో జైపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించాడు.
కరౌలి పోలీసు సూపరింటెండెంట్ మృదుల్ కచావా తెలిపిన వివరాల ప్రకారం… రాధాకృష్ణ టెంపుల్ ట్రస్టుకు చెందిన మూడు ఎకరాల భూమి జిల్లా సమీపంలోని గ్రామంలో ఉంది. అయితే ఈ స్థలాన్ని ప్రభుత్వం పూజారుల మనుగడకు కేటాయించింది. అక్కడే తన సొంత ఇంటిని నిర్మించుకోవాలని బాబూలాల్ నిర్ణయించుకుని అందుకు ప్రయత్నించగా గ్రామంలోని కైలాష్ మీనా అనే వ్యక్తితోపాటు అతని కుటుంబానికి చెందిన ఇతరులు అడ్డుకున్నారు. వారు ఆ స్థలంలోనే అక్రమంగా అక్కడ షెడ్ నిర్మించగా బాబూలాల్ అభ్యంతరం చెప్పడంతో పంచాయతీ గ్రామ పెద్దలవరకు వెళ్ళింది. అయితే తీర్పు పూజారికి అనుకూలంగా రావడంతో బాబూలాల్ ఇంటిపై, అతని ధాన్యం బస్తాలపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. అడ్డుకోబోయినందుకు అతనిపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు.
కాగా, బాబూలాల్ బంధువులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేసి ఆస్పత్రికి తరలించగా.. పోలీసులు అక్కడికి వెళ్లి బాబూలాల్ వాంగ్మూలం నమోదుచేశారు. కైలాష్ మీనాతోపాటు మరో ఐదుగురు వ్యక్తులు తనతో గొడవకు దిగారని, మాటామాటా పెరుగడంతో అప్పటికే తెచ్చిపెట్టిన పెట్రోల్‌ను తన జొన్నబస్తాలపై పోసి తగులబెట్టారని, అడ్డుకోవడంతో తనపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారని బాబూలాల్ పోలీసులకు ఇచ్చి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ వాంగ్మూలం ఆధారంగా ప్రధాన నిందితుడు కైలాష్ మీనాను అరెస్టు చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.