పీఎల్‌‌ఐ లిస్ట్ నుంచి రాజేష్ ఎక్స్‌‌పోర్ట్స్ ఔట్‌‌?.. సెబీ ఆరోపణలే కారణం

పీఎల్‌‌ఐ లిస్ట్  నుంచి రాజేష్  ఎక్స్‌‌పోర్ట్స్  ఔట్‌‌?.. సెబీ ఆరోపణలే కారణం

న్యూఢిల్లీ: అడ్వాన్స్‌‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్ కోసం ఉద్దేశించిన ‘ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్’ (పీఎల్‌‌ఐ) పథకం నుంచి బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ రాజేష్ ఎక్స్‌‌పోర్ట్స్‌‌ను తొలగించేందుకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌‌ఐ) సిద్ధమవుతోంది. ఆ కంపెనీ భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు గత వారం మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఒక తాత్కాలిక ఉత్తర్వు జారీ చేయడమే దీనికి కారణం. 

కంపెనీని పీఎల్ఐ లబ్ధిదారుల జాబితా నుంచి తక్షణమే తొలగించాలనే గట్టి అభిప్రాయం మంత్రిత్వ శాఖలో వ్యక్తమవుతోందని పీటీఐ  వర్గాలు తెలిపాయి. కిర్గిజిస్తాన్ అధికారిక పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ముందు ఈ ఫైల్‌‌ను ఉంచారు. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.  

ప్రధానంగా బంగారు ఆభరణాల తయారీ, ఎగుమతి వ్యాపారంలో ఉన్న ఈ సంస్థ.. ఆర్థిక సంవత్సరాలు 2021–  2025 మధ్య కాలంలో తన అనుబంధ సంస్థల ద్వారా ఏకంగా రూ. 15.15 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని  ఎక్కువగా చూపించిందని సెబీ పేర్కొంది. వాస్తవ ఆదాయం కేవలం రూ.3 వేల కోట్లేనని తెలిపింది.  కంపెనీకి చెందిన లిథియం-అయాన్ సెల్ వ్యాపారంతో ముడిపడి ఉన్న ‘ఎలెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ , ‘ఏసీసీ ఎనర్జీ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్’ లలో పారదర్శకత లేని లావాదేవీలు, నిధుల మళ్లింపులు జరిగినట్లు సెబీ గుర్తించింది. 

నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో, రాజేష్ ఎక్స్‌‌పోర్ట్స్ ప్రమోటర్, చైర్మన్ రాజేష్ మెహతాపై సెబీ నిషేధం విధించింది. తదుపరి విచారణ ముగిసేవరకు ఆయన కంపెనీ షేర్లను కొనడం, అమ్మడం లేదా ఎలాంటి ట్రేడింగ్ లావాదేవీలు చేయకూడదని ఆదేశించింది. అలాగే కంపెనీ ఖాతా పుస్తకాలపై సరికొత్త 'ఫోరెన్సిక్ ఆడిట్'కు ఆదేశాలు జారీ చేసింది.