Rajinikanth : రజనీకాంత్ ఇంటి చుట్టూ పోలీసులు.. ఉలిక్కిపడ్డ చెన్నై!

Rajinikanth : రజనీకాంత్ ఇంటి చుట్టూ పోలీసులు.. ఉలిక్కిపడ్డ చెన్నై!

ఇటీవల సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలు టార్గెట్ గా  బాంబు బెదిరింపులు సర్వసాధారణమైపోయింది.  ఈ వరుస బెదిరింపులతో తమిళనాడులో ముఖ్యంగా సెలబ్రిటీల ఇళ్ల వద్ద భయాందోళన వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్, సూపర్ స్టార్ రజనీకాంత్, త్రిష, సంగీత దర్శకులు ఇళయరాజా వంటి ప్రముఖుల ఇళ్లకు ఈ మధ్య కాలంలో బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది.

రజనీకాంత్ ఇంటికి మళ్లీ బెదిరింపు!

లేటెస్ట్ గా చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసానికి  మరోసారి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది..  రెండు వారాల వ్యవధిలోనే సూపర్ స్టార్ కు ఇలాంటి బెదిరింపు వచ్చాయి. ఇప్పుడు ఇది రెండో సారి. ఈసారి డీజీపీ కార్యాలయానికి నేరుగా ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపు అందింది. రజనీకాంత్ నివాసంలో బాంబు పెట్టాం అని ఆ ఈమెయిల్‌లో ఉంది..

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణమే అప్రమత్తమైయ్యారు. బాంబు స్క్వాడ్ నిపుణులతో రజనీకాంత్ ఇంటికి హుటాహుటిన చేరుకున్నారు. అయితే  రెండు వారాల క్రితం బెదిరింపు వచ్చినప్పుడు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కానీ, ఈసారి స్వయంగా  రజనీకాంత్ తనిఖీలు అవసరం లేదని చెప్పడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. ఇది ఫేక్ కాల్ గా కొట్టిపడేశారు.

పోలీసులకు సవాల్ గా ఫేక్ కాల్స్..

గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ద్వారా ప్రముఖుల ఇళ్లలో బాంబులు పెట్టామని బెదిరిస్తున్నారు. అయితే, ఇలా పదే పదే బెదిరింపులకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడంలో పోలీసు శాఖ సతమతమవుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల నుండి కూడా ఈ విషయంలో పోలీసుల తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఇలాంటి బెదిరింపులు కేవలం అల్లరి కోసం, లేదా ఆకతాయిల చర్యల వల్ల జరుగుతున్నప్పటికీ, వీటి వల్ల విలువైన పోలీస్ సమయం వృథా అవుతుంది,

 అలాగే నిజంగా ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్న చోట్ల దృష్టి మళ్లించే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ క్రిమినల్స్‌ను త్వరితగతిన పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని, దీనికి కఠినమైన శిక్షలు పడేలా చూడాలని ప్రజలు, ముఖ్యంగా సెలబ్రిటీల అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బెదిరింపుల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమై ఉన్నాయా.? నిందితులు ఎప్పుడు పట్టుబడతారు? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.