Rajinikanth: రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. పవన్ కళ్యాణ్ అభినందనలకు తలైవా భావోద్వేగ స్పందన

Rajinikanth: రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం..  పవన్ కళ్యాణ్ అభినందనలకు తలైవా భావోద్వేగ స్పందన

 భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నటుడు రజనీకాంత్. సినీ పరిశ్రమలో ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఐదు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ సూపర్ స్టార్  సినీపరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రముఖుల నుండి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.  ప్రధాని నరేంద్ర మోదీతో సహా సినీ, రాజకీయ ప్రముఖులందరూ 'తలైవా'కు శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ అభినందనల పరంపరలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా 'తలైవా'కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి స్పందిస్తూ, రజనీకాంత్ పవన్‌ కళ్యాణ్‌కు తన X ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రాజకీయ తుపాన్ అయిన పవన్ కళ్యాణ్ గారు, మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞుడిని. మీ దయతో కూడిన మాటలు నా హృదయాన్ని నింపాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అంటూ రజనీకాంత్ చేసిన ట్వీట్ అభిమానులందరినీ ఆకట్టుకుంది.

రజనీకాంత్ సందేశానికి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. గౌరవనీయులైన సర్, బిగ్ బ్రదర్ రజనీకాంత్ గారు, మీ ఆప్యాయతతో కూడిన మాటలకు, ఆశీర్వాదాలకు నేను నిజంగా ఎంతో కృతజ్ఞుడిని. వాటిని నా హృదయంలో ఎంతో గౌరవం, కృతజ్ఞతతో గౌరవిస్తాను. మీ ఆధ్యాత్మిక మార్గం కీర్తి, విజయం, మంచి ఆరోగ్యంతో నిండి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని బదులిచ్చారు.

పవన్ కళ్యాణ్ రజనీకాంత్ సినీ ప్రస్థానంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, రజనీకాంత్ గారి ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. ఆయన విలన్‌గా చేసిన పాత్రలలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. ఇక హీరోగా ఆయన చూపించిన మ్యాజిక్ కోట్లాది మంది అభిమానులను మంత్రముగ్ధులను చేసింది అని పేర్కొన్నారు. ఆయన పేరుతో టైటిల్ కార్డ్ పడగానే థియేటర్లలో ప్రేక్షకులు కేరింతలు కొట్టడం నేను స్వయంగా చూశాను. ఆ మంత్రం ఈనాటికీ తగ్గలేదు అంటూ రజనీకాంత్ ప్రభావం ఎంత గొప్పదో పవన్ కళ్యాణ్ వివరించారు. 

 

రజనీకాంత్ నటించిన 'కూలీ' బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తోంది. ఈ మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ చిత్రాల్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులను 'కూలీ' బద్దలు కొట్టింది.