రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక దోషికి బెయిల్

రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక దోషికి బెయిల్

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక దోషికి బెయిల్ దొరికింది. ఈ కేసుకు సంబంధించి కీలక దోషుల్లో ఒకరైన ఏజీ పెరరివాలన్‌కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. పెరారివాలన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడి 32 ఏళ్లుగా జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదల చేయాలంటూ తాను వేసిన పిటిషన్‌పై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 

బెయిల్‌ను కేంద్రం వ్యతిరేకిస్తోందని పేర్కొంది. పిటిషనర్ ప్రవర్తన, అతని అనారోగ్యంతోపాటు అతను 30 ఏళ్లకు పైగా జైలులో గడిపిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, అతన్ని బెయిల్‌పై విడుదల చేయాలని అభిప్రాయపడుతున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, పెరారివాలన్ పలు షరతులను అనుసరించాల్సి ఉంటుంది. ప్రతి నెలా స్థానిక పోలీసు అధికారి ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.  చెన్నైకి 100 కి.మీ దూరంలో ఉన్న తన స్వగ్రామమైన జోలార్‌పేటలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. పోలీసులకు చెప్పకుండా  స్వగ్రామం కూడా వదిలి వెళ్లడానికి అతనికి అనుమతి లేదని పేర్కొంది.