
- ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ సభలో ప్రకటించిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే
- 20 ఏండ్ల తర్వాత ఒకే వేదికపైకి వచ్చిన అన్నదమ్ములు
- ఇక అన్ని ఎన్నికల్లో కలిసి పోటీచేస్తమని ప్రకటన
- మహారాష్ట్రపై హిందీని రుద్దేందుకు బీజేపీ యత్నం
- భాషపై రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరిక
ముంబై: రాబోయే స్థానిక సంస్థలతోపాటు అన్ని ఎన్నికల్లోనూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)తో తాము కలిసి పోటీ చేస్తామని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఇకపై కలిసి ఉండేందుకు తామిద్దరం కలిసి వచ్చామని చెప్పారు. త్రిభాషా విధానం అమలుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో శనివారం ముంబైలోని వర్లిలో ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ ఠాక్రే కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. 2005లో విడిపోయిన సోదరులిద్దరూ దాదాపు 20 ఏండ్ల తర్వాత తిరిగి ఒకే వేదికపై కనిపించడం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోం..
‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలోని బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు హిందీని బలవంతంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. హిందీని ప్రజలపై బలవంతంగా రుద్దితే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులాంటి రాష్ట్రాల్లో హిందీ అమలుకు ప్రయత్నిస్తారా? అని సవాల్ చేశారు. మహారాష్ట్ర, మరాఠీవైపు ఎవరు చెడుగా చూసినా తాము సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. మరాఠీ ప్రజలు తన భాషను ఎవరిపైనా రుద్దబోరని, ఇలాచేసే ఒక్క మరాఠీనైనా తమకు చూపించండని అన్నారు. ఏ భాషకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఏదైనా భాషను బలవంతం చేస్తే తమ శక్తిని చూపిస్తామని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు.‘‘మన బలం మన ఐక్యతలో ఉండాలి. సంక్షోభం వచ్చినప్పుడల్లా మనం కలిసి ఉంటాం. ఆ తర్వాత మనం మళ్లీ మనలో మనం పోరాడటం ప్రారంభిస్తాం’’ అని అక్కడున్న శివసేన, ఎంఎన్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘విడిపోతే పడిపోతాం’ అంటూ హిందూ, ముస్లింలను విభజించేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో నినాదాలిచ్చిన బీజేపీ.. ఇప్పుడు ఆ స్లోగన్‌ను మహారాష్ట్ర ప్రజలను విడగొట్టేందుకు వాడుకుంటున్నదని మండిపడ్డారు. వారు (బీజేపీ) రాజకీయ దళారులని ఫైర్ అయ్యారు. మరాఠీ ప్రజలందరం మనలో మనం పోరాడుతుంటే.. ఢిల్లీ బానిసలు మనల్ని పాలించడం ప్రారంభించారని ఏక్‌నాథ్‌షిండేపై విమర్శలు గుప్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీటింగ్‌లో షిండే ‘జై గుజరాత్’ స్లోగన్ చేసి, తన బానిసత్వాన్ని నిరూపించుకున్నారని మండిపడ్డారు.
ఇక ఒక్కటిగానే ఉంటం..
20 ఏండ్ల కిందట విడిపోయిన తమను ఒక్కటి చేయడం బాల్‌ఠాక్రేకు కూడా సాధ్యం కాలేదని, కానీ..రాష్ట్రానికి వ్యతిరేకంగా సీఎం ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం ఆ పనిచేసిందని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. మహారాష్ట్రకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు అనుకోకుండానే తాము ఒకే స్టేజీపైకి వచ్చామని, ఇక కలిసే ఉంటామని చెప్పారు. ముంబైని మహారాష్ట్రతో విడదీయాలనే హిందీ భాషను బీజేపీ సర్కారు బలవంతంగా రుద్దాలని చూస్తున్నదని మండిపడ్డారు. తమకు హిందీ భాషపై ఎప్పటికీ వ్యతిరేకత లేదని, కానీ, ఆ భాషను బలవంతంగా అమలు చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే పిల్లలు సరైన విషయాలు నేర్చుకోలేరంటూ మోదీ సర్కారు అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. సౌత్ ఇండియాలో సినీ నటులు, పొలిటీషియన్స్ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నా తమ మాతృభాషకు ఎంతో గౌరవం ఇస్తారని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలకు కూడా తమ మాతృభాష మరాఠీపై అలాగే ప్రేమ ఉంటుందని అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇంగ్లిష్‌లోనే ఉంటాయని, అలాంటప్పుడు హిందీ భాష ఎందుకని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ లేని త్రిభాషా విధానాన్ని మహారాష్ట్రపై రుద్దాలని చూస్తే.. ఏం జరుగుతుందో ఇప్పటికైనా కేంద్రం తెలుసుకోవాలని హెచ్చరించారు.
2005లో విడిపోయి.. మాతృ భాష కోసం కలిసి..
2005లో మాల్వాన్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్‌ఠాక్రే కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకే శివసేన పార్టీని రాజ్ ఠాక్రే పార్టీని వీడారు. ‘‘నేను కోరుకుంది గౌరవం.. కానీ నాకు దక్కింది అవమానం”అంటూ రాజ్ ఠాక్రే శివసేనకు రాజీనామా చేశారు. 2003లో ఉద్దవ్ థాక్రేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం కూడా రాజ్ ఠాక్రే జీర్ణించుకోలేకపోయారు. ఎట్టకేలకు భాష కోసం జరుగుతున్న ఉద్యమంలో ఈ అన్నదమ్ములిద్దరు మళ్లీ కలవడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమంలో ఈ ఇద్దరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, ఇతర నాయకులు హాజరైనప్పటికీ, రాజ్, ఉద్ధవ్ మాత్రమే వేదికపై ఆసీనులయ్యారు.