గుండెపోటుతో ఇంటర్మీడియట్ విద్యాధికారి రాజ్యలక్ష్మి మృతి

గుండెపోటుతో ఇంటర్మీడియట్ విద్యాధికారి రాజ్యలక్ష్మి మృతి

కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈవో) రాజ్యలక్ష్మి గుండెపోటుతో మృతిచెందారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా.మధుసూదన్ రెడ్డి, ఇతర గెస్టు అధ్యాపకులు రాజ్యలక్ష్మి మృతదేహానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

ఉన్నతాధికారి వేధింపుల వల్లే రాజ్యలక్ష్మికి గుండెపోటు వచ్చి చనిపోయారని మధుసూధన్ రెడ్డి ఆరోపించారు. సైదాపూర్ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉందని అడిగిన దానికి జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా పని చేస్తున్న జయప్రద భాయి దుర్భాషలాడి రాజ్యలక్ష్మి మనోవేదనకు గురయ్యేలా చేశారని చెప్పారు. జయప్రద భాయి మాటల వల్లే రాజ్యలక్ష్మికి గుండెపోటు వచ్చి చనిపోయారన్నారు. ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో 8 నెలలుగా కొనసాగుతున్న అరాచకపాలన పరాకాష్టకు చేరిందన్నారు. జిల్లా అధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 33 జిల్లాల్లోని ఇంటర్మీడియట్ విద్యాధికారులు స్వతంత్ర్యంగా, స్వేచ్ఛగా మాట్లాడే వీలులేకుండా పరిస్థితి ఉందన్నారు.

కరీంనగర్ డీఐఈవో రాజ్యలక్ష్మి మృధుస్వభావి, ఎవరినీ నొప్పించేవారు కాదన్నారు మధుసూధన్ రెడ్డి. ఇంటర్మీడియట్ కమిషనర్ నవీన్ మిట్టల్ అరాచక పాలనకు చరమగీతం పాడేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న 1650మందిని తొలగించాలని చూడటం సరికాదన్నారు. నవీన్ మిట్టల్ చర్యను సమర్ధించే విధంగా వ్యవహరిస్తున్న  రాష్ర్ట ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. కడుపులో పెట్టుకుని చూసుకుంటామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పినా ఇప్పటి వరకు గెస్ట్ లెక్చరర్లకు వేతన బకాయిలు ఇవ్వడం లేదన్నారు మధుసూధన్ రెడ్డి. నవీన్ మిట్టల్ ను జైలుకు పంపేదాకా ఇంటర్ విద్య జేఏసీ నిద్రపోదని హెచ్చరించారు.