కోచింగ్​ వ్యాపారంగా మారింది పేపర్లలో రోజూ వాటి ప్రకటనలే: : రాజ్యసభ చైర్మన్​ జగదీప్​ ధన్​ఖడ్​

కోచింగ్​ వ్యాపారంగా మారింది పేపర్లలో రోజూ వాటి ప్రకటనలే: : రాజ్యసభ చైర్మన్​ జగదీప్​ ధన్​ఖడ్​
  • రావూస్​ కోచింగ్​ సెంటర్​ ఘటనపై ఉభయ సభల్లో చర్చ
  • కోచింగ్​ సెంటర్లలో నరకం అనుభవిస్తున్నం: సీజేఐకి సివిల్స్​ అభ్యర్థి లేఖ
  • ఆక్రమణలపై బుల్డోజర్​ యాక్షన్​ షురూ
  • 13 కోచింగ్​ సెంటర్లు సీజ్​.. దర్యాప్తుకు కమిటీ

న్యూఢిల్లీ: కోచింగ్ వ్యాపారంగా మారిందని.. రోజూ పత్రికల్లో మొదటి ఒకటి రెండు పేజీలు కోచింగ్ సెంటర్ల ప్రకటనలే ఉంటున్నాయని రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అన్నారు. కోచింగ్ సెంటర్ల వ్యాపార ధోరణి ఆందోళనకర స్థాయికి చేరిందన్నారు. ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో వరద నీట మునిగి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోవడంపై సోమవారం రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు అనుమతించారు. కాంగ్రెస్‌  ఎంపీ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తేవాలన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్​ మాట్లాడుతూ.. ఢిల్లీలోని అక్రమ నిర్మాణాలపైకి కూడా బుల్డోజర్లను పంపుతారా? లేదా? చెప్పాలన్నారు. కొన్ని కోచింగ్ సెంట్లరు మాఫియాగా మారాయని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. “ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకుంటుందా? లేదా?’’ అని ప్రశ్నించారు. ఈ దుర్ఘటనకు ఆప్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ అన్నారు. 

బాధ్యతగా పరిష్కరించుకుందాం: ప్రధాన్​

కోచింగ్ సెంటర్ లోకి వరద ఘటనపై రాజకీయాలు వద్దని.. బాధ్యతగా  సమస్యను పరిష్కరించుకుందామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. దీనికి కేంద్ర, రాష్ట్రాల్లో ఎవరైనా బాధ్యత వహించాలి” అని అన్నారు. కోచింగ్ సెంటర్‌లు కూడా రూల్స్  పాటించాలన్నారు. కేంద్రం జనవరిలోనే  రాష్ట్రాలు, యూటీలకు అడ్వైజరీ పంపిందని, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని అనుసరించి ఉంటే ఈ దురదృష్టకర సంఘటన జరిగేది కాదన్నారు.