టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మూడు ఫార్మాట్ లలో జాతీయ జట్టులో స్థానం దక్కిచుకోలేకపోతున్నాడు. ఓ వైపు సెలక్టర్లు షమీ ఫిట్ నెస్, ఫామ్ పై తమకు అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేయగా.. మరోవైపు ఈ సీనియర్ పేసర్ తాను పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నా సెలక్టర్లు ఎంపిక చేయట్లేదని నిరాశ వ్యక్తం చేశాడు. దీంతో షమీకి ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ ఛాలెంజింగ్ గా మారింది. ఈ ఏడాది రంజీల్లో బెంగ్లా తరపున బరిలోకి దిగిన షమీ దుమ్ములేపుతున్నాడు. 35 ఏళ్ళ వయసులో తన బౌలింగ్ తో నిప్పులు చెరిగాడు. ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లాడిన షమీ ఏకంగా 15 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి మ్యాచ్ లో ఉత్తరాఖండ్‌పై బెంగాల్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో షమీ తొలి ఇన్నింగ్స్ లో మూడు.. రెండు ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. బెంగాల్ గెలుపులో కీలక పాత్ర పోషించిన షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మంగళవారం (అక్టోబర్ 28) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ పై జరిగిన మ్యాచ్ లో మరింత రెచ్చిపోయాడు. 35 ఏళ్ల ఈ పేసర్ తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. రెండో ఇన్నింగ్స్ లో 38 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఓవరాల్ గా రెండు మ్యాచ్ ల్లో 15 వికెట్లు పడగొట్టి సెలక్టర్లకు సవాలు విసిరాడు. షమీ బౌలింగ్ తో గుజరాత్‌ను బెంగాల్ 141 పరుగుల తేడాతో ఓడించింది. సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి రెండు మ్యాచ్ ల టెస్ట్ జరగనుంది. ఈ సిరీస్ కు షమీ ఎంపికవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ షమీని సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయకపోతే అతడి కెరీర్ ముగిసినట్టుగానే చెప్పుకోవాలి. మరి సెలక్టర్లు షమీ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.
ALSO READ : టీమిండియాలో అతడి ఫామ్ దెబ్బకు హేజల్ వుడ్ పనికిరాడు
షమీని ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టిన సెలక్టర్లు ఇకపై వన్డేల్లోనూ చెక్ పెట్టబోతున్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. మూడు ఫార్మాట్ లలో చోటు దక్కించుకోలేకపోతున్న ఈ స్టార్ పేసర్ తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తనని ఎందుకు జట్టులో తీసుకోవట్లేదో పరోక్షంగా సెలక్టర్లకు ప్రశ్నించాడు. తాను ఫిట్ గా ఉన్నానని చెబుతూ భారత జట్టు యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు.
వాస్తవానికి ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడం షమీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 9 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అప్పటికే ఫిట్‌నెస్, ఫామ్ తో ఇబ్బందిపడిన షమీకి ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ సిరీస్ లోనూ ఇండియా ఏ జట్టులో స్థానం దక్కలేదు. ఆ తర్వాత ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకొని నిరాశపరిచాడు. ఓవరాల్ గా షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టుగానే కనిపిస్తుంది.
