రాకేశ్ కిశోర్ .. ఓ సనాతన స్వభావం

రాకేశ్ కిశోర్ .. ఓ సనాతన స్వభావం

‘దేవుడు పదం రూపంలో అవతరించాడు. ఈ ప్రపంచం పదంతో మారింది’ అని ఒక ఆధ్యాత్మిక నానుడి ఉంది. మాటలు మానవులను మార్చాయి. సమూహాలను ఏర్పరిచి ఉత్పత్తిని పెంచాయి. మాట మానవ సంస్కృతిని, నాగరికతను మార్చింది. ఆ మాటల బలమైన రూపమే చట్టం. ఆ చట్టాలను అమలుపర్చే కోర్టు ప్రపంచంలో హింసను ఆపి మాటకు బలాన్ని  చేకూర్చింది. మన దేశ రాజ్యాంగాన్ని అంబేద్కర్​ ఇంగ్లిష్​ మాటలతో అహింసా శక్తిగా  కూర్చాడు. ఈ రాజ్యాంగాన్ని కాపాడే అత్యున్నత కోర్టు, అత్యున్నత జడ్జిపై  సనాతన ధర్మవాది బూటును ఆయుధంగా వాడుకొని మాటను చంపచూశాడు. ఈ మధ్య కాలంలో దేశంలో హిందుత్వ శక్తులు తిరిగి బలపర్చాలనుకుంటున్న సనాతన ధర్మం అర్థమేమిటో రాకేశ్ కిశోర్​ స్పష్టంగా సుప్రీంకోర్టులోనే చెప్పాడు.

రాకేశ్​కిశోర్​ అక్టోబర్​ 6న నిండు కోర్టులో జస్టిస్​ బీఆర్​ గవాయ్​పై బూటు విసిరి ‘సనాతన ధర్మం వర్ధిల్లాలి’ అని అరుస్తూ పోలీసులకు చిక్కాడు. తాను బూటును గవాయ్​పైన విసిరింది ఆయన ఒక కేసు వింటున్నప్పుడు. ఒక విష్ణు విగ్రహం విషయంలో చెప్పిన వ్యాఖ్య  తమ సనాతన ధర్మ వ్యతిరేకమైందనీ.. అందుకే గవాయ్​ని బూటుతో కొట్టానని స్పష్టంగా చెప్పాడు. అంతేగాక   దైవ ఆజ్ఞతోనే ఆ పని  చేశానని, అలా చేసినందుకు చింతించడం లేదని కూడా మీడియాకు చెప్పాడు. ఈ అత్యున్నత న్యాయస్థాన, అత్యున్నత జడ్జిమీద బూటు విసిరింది కేవలం ఆయనకు హాని కలిగించేందుకు కాదు. బూటును ఈ దేశపు సనాతన ధర్మ సిద్ధాంతం ఒక చండాల వస్తువుగా చూసింది. సనాతన ధర్మ సిద్ధాంతానికి, ఈ రోజు హిందూయిజంగా  పరిగణించే మతానికి లేదా జీవన విధానానికి చాలా తేడా ఉంది. హిందూయిజం అనే భావనలో సంస్కృతేతర ఆధ్యాత్మిక భావనలు కొంతమేరకైనా మమేకం అవుతాయి. కానీ, సనాతన ధర్మ సిద్ధాంతం దళితులకే కాదు మొత్తం శూద్ర జాతికే వ్యతిరేకం. దాని పునాదిలోనే ఆ వ్యతిరేకత ఉంది.  శూద్రులంతా..రెడ్లు, వెలమలు, కమ్మలు, కాపులతో సహా సనాతన ధర్మ సిద్ధాంతం ప్రకారం వెలివేయబడ్డవారే. వ్యవసాయ పనితోపాటు కమ్మరి, వడ్రంగి,  గోల్డ్​స్మిత్,  కుమ్మరి వంటి ఇంజినీరింగ్​ పనులన్నీ సనాతన ధర్మ సిద్ధాంతం ప్రకారం నీచమైనవే. అందుకే, అన్నిరకాల శూద్ర కులాలకు  ప్రతి దేవుని దగ్గర సమాన హక్కులు లేవు. 

సీజేఐపై హింసాప్రయత్నం

ఏ వైష్ణవ గుడిలో కూడా పూజారి అయ్యే హక్కు శూద్రులకు లేదు. బ్రిటిష్ వారు వచ్చి ఇంగ్లిష్​  విద్య ప్రారంభించేవరకు చదువుకునే హక్కు లేదు. సంస్కృతం చదివే హక్కు అసలేలేదు.  ఈ సనాతన ధర్మ సిద్ధాంతాన్ని ఉదయనిధి స్టాలిన్​ ప్రారంభించిన చర్చతో ఆర్ఎస్ఎస్, బీజేపీలోని ద్విజులు మళ్లీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ప్రధాని మోదీ కూడా అది తన మతధర్మం అంటున్నారు. ఈ స్థితిలో చీఫ్​జస్టిస్​ గవాయ్​ ఒక విష్ణు విగ్రహం విషయంలో చేసిన చిన్న కామెంట్​ సనాతన ధర్మ వ్యతిరేకమని బూటు హింసకు దిగడం జరిగింది. మొదటిసారి ఈ దేశపు సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​పై  బూటు హింసా ప్రయత్నం జరిగింది.  అదే సనాతన ధర్మం ప్రకారం తోలుబూటు హింసాత్మకమైనదేకాక అవమానకరమైంది. జస్టిస్​ గవాయ్ దళిత చీఫ్​ జస్టిస్​ అయి ఉండకపోతే  ఈ బూటు హింసా ప్రయత్నం జరిగేదా? దేశాన్ని పరిపాలించే బీజేపీ, ఆర్ఎస్ఎస్..సనాతన ధర్మం ఈ దేశ ధర్మం అని ప్రచారం చేస్తున్న దశలో ఇలా జరిగితే దళితులే కాదు శూద్రులకూ ఆత్మస్థైర్యం ఉంటుందా? శూద్రులు, ఓబీసీలు ఈ అంశాన్ని చర్చించడం లేదు. 

ఇస్లామిక్​ దేశాల్లో.. ప్రజాస్వామ్యం బతికేస్థితి లేదు

సనాతన ధర్మం.. ఇప్పుడు హిందూయిజంగా ప్రచారంలో ఉన్న మత విలువలు ఒకటికావు. సనాతన ధర్మం మత విలువ కేవలం ద్విజ కులాల ఆధిక్యతను కాపాడి శూద్ర, దళిత, ఆదివాసీలను అణగదొక్కడానికి సంస్కృత గ్రంథాల ద్వారా నిర్ణయించబడింది. హిందూయిజం దేశ జీవన విధానంగా వాళ్లే నిర్వచిస్తున్నారు. సనాతన ధర్మానికి అటువంటి కలుపుగోలుతనం కూడా లేదు. అది మతవాద రాజకీయ నాయకులకు తెలియంది కాదు. ఇస్లామిక్​ దేశాలలో కూడా జ్యుడీషియల్​ వ్యవస్థ అల్లా పేరుతో లేదా ఇతర మతపర కేసులతో ఎటాక్​చేసి బలహీనపర్చారు. అందుకే ఆ దేశాలలో ప్రజాస్వామ్యం బతికే స్థితి లేదు. మతపర ప్రతి చిన్న అంశాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లి తమకు అనుకూలమైన జడ్జిమెంటు రాకుంటే జడ్జిలపై దాడి ఈ దేశంలో కూడా మొదలైంది. అందుకే, ఒక సెక్యులర్​జడ్జి అనుకున్న మాజీ చీఫ్​ జస్టిస్​ చంద్రచూడ్​ కూడా సనాతన ధర్మం ఆధారంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ స్థితి జస్టిస్​ గవాయ్​ వంటి సెక్యులర్​  జడ్జి కోర్టులో వాడే ప్రతి పదాన్ని సనాతన ధర్మ వ్యతిరేకం అని ద్విజ మేధావులు చర్చించడం ఆయన చీఫ్​ జస్టిస్​ అయినప్పటి నుంచి జరుగుతోంది. దాని పరాకాష్టగా  రాకేశ్ కిశోర్​ బూటు హింస సుప్రీంకోర్టులో ఎలా జరిగిందో చూశాం. 

అహింసావాద ప్రతినిధిగా గవాయ్​

సుప్రీంకోర్టు  చీఫ్​ జస్టిస్​ గవాయ్​ బుద్ధిస్ట్​ కుటుంబంలో పెరిగాడు. ప్రాచీన కాలం నుంచి సనాతన ధర్మం సిద్ధాంతానికి, బుద్ధిజానికి హింసపైన తీవ్రమైన 
సంఘర్షణ జరిగింది. సనాతన ధర్మ హింసావాదాన్ని  వ్యతిరేకిస్తూనే  బుద్ధుడు అహింసా సిద్ధాంతాన్ని దేశానికి నూరి పోశాడు. చీఫ్​ జస్టిస్​ గవాయ్..రాకేశ్​ కిశోర్​ను క్షమించాను వదిలేయండి, కేసు కూడా పెట్టనవసరం లేదు అని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్​కు చెప్పారు. ఫలితంగా నిందితుడు హాయిగా ఇంట్లో కూర్చొని ఉంటున్నాడు. అయితే, దేశ హోంమంత్రిగానీ, లా మినిస్టర్​గానీ ఈ ఘటనపై ఏమీ మాట్లాడిన దాఖలాలు లేవు. తమంతట తాము చర్యలకు ఆదేశించిన దాఖలాలు లేవు. జస్టిస్​ గవాయ్​  చీఫ్​ జస్టిస్​గా ఉన్న కొద్దికాలంలోనే ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి తీసుకున్న స్టెప్పులు ఒక ఎత్తు  ఈ ఘటనకు ఆయన స్పందించిన తీరు మరొక ఎత్తు. ఆయన సుప్రీంకోర్టులో అంబేద్కర్, బుద్ధుని అహింసావాద ప్రతినిధిగా చరిత్రలో నిలిచిపోతాడు. హింసాత్మకవాదులు ఆ చరిత్రను ఎంత చెరిపేయాలన్నా అది వారివల్ల కాదు. తన ప్రాణానికి, తను ప్రాతినిధ్యం వహిస్తున్న అంబేద్కర్​ రాజ్యాంగాన్ని కాపాడే అత్యున్నత కోర్టు అధినేతగా గవాయ్​ ఎంత ఉన్నత విలువలతో వ్యవహరించాడనేది ఇక్కడ కీలకం. ఇప్పుడు ఆయన ఆ ఉన్నత విలువలకు ప్రతిబింబమయ్యాడు. రాకేశ్​ కిశోర్​ వంటివారి నుంచి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని  కాపాడే  సుప్రీంకోర్టును అత్యున్నత విలువలతో  కాపాడాడు. అయితే, కేంద్ర పాలకులెవ్వరు ఆయన ఔన్నత్యాన్ని మెచ్చుకున్న వార్తలు లేవు. 

ప్రమాద సూచిక

 సనాతన నమ్మకదారి చేసిన ఈ హింసాయుత పని దేశ భవిష్యత్​కి ఒక ప్రమాద సూచిక. మతపర ప్రతి చిన్న విషయాన్ని  సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు తీసుకెళ్లి  తీర్పు నచ్చలేదనో, జడ్జి మాట మనోభావాన్ని దెబ్బతీసిందనో హింసకు పూనుకున్న ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్యం బతకలేదు. మత సంబంధింత ఏ అంశాన్నైనా సెంటిమెంట్​ సమస్యగా మార్చి ఆర్గనైజ్డ్​ మూకలతో హింసను  రెచ్చగొట్టవచ్చు.ఇటువంటి మతతత్వ భావాలు అమెరికా, యూరప్​ దేశాల్లో, ఆస్ర్టేలియా, కెనడాలో కూడా పొడ చూపుతున్నాయి.  గత మూడువందల సంవత్సరాల ప్రజాస్వామ్య రాజ్య నిర్మాణ చరిత్రలో చాలా ముస్లిం దేశాల్లో ప్రజాస్వామ్యాలు కూలిపోయి సైనికపాలన వచ్చింది. హింసాత్మక శక్తులు టెర్రరిస్టులుగా మారింది కూడా ఇటువంటి చాంధసవాదం రాజ్యంలో చొరబడటం వల్లనే. అటువంటిచోట ఎన్నికల వ్యవస్థ పనిచేయదు. భారతదేశం వంటి కులదొంతర ఉన్న దేశంలో మతం పేరుతోనే ఉత్పత్తి కులాలను బానిసలుగా మల్చుకున్నారు. 

లీగల్ ​వ్యవస్థ పరిరక్షకుడు గవాయ్​

1947 తరువాత క్రమంగా కొన్ని హక్కులు శూద్రులకు, బీసీలకు, దళితులకు, ఆదివాసీలకు అందివస్తున్నాయి. వాటికి రోజువారీ రక్షణ కోర్టులు కలిపిస్తాయి. ఆ కోర్టులో ఇటువంటి శక్తులు రాకేశ్​ కిశోర్​లా దాడులు మొదలుపెడితే అసలు ప్రమాదం దేశంలోని ఉత్పత్తి కులాలకు మాత్రమే. వారికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ కులాలన్నీ జస్టిస్​ గవాయ్​ని లీగల్ వ్యవస్థ పరిరక్షకుడిగా చూడాల్సి ఉంది. అంబేద్కర్​ కనుక ప్రపంచానికే ఆదర్శవంతమైన ఒక రాజ్యాంగాన్ని ఆనాడు రాసి ఉండకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండేది కాదు. కానీ, సనాతనధర్మ సిద్ధాంతం మనువాదాన్ని అంగీకరిస్తుందికానీ ఇటువంటి సర్వమాన సమాన హక్కులు కలిగించే రాజ్యాం గాన్ని ఒప్పుకోదు. అందుకే గవాయ్​ అహింసా వాదానికి శ్రమజీవులంతా సెల్యూట్​ కొట్టాలి. 

‌‌‌‌‌‌‌‌- కంచ ఐలయ్య షఫెర్డ్​