నటి రాఖీ సావంత్ పెళ్లిపై వీడిన మిస్టరీ

నటి రాఖీ సావంత్ పెళ్లిపై వీడిన మిస్టరీ

ఏదో ఒక విషయంపై ఎప్పుడూ ట్రెండింగ్ లో నిలిచే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ .. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె పెళ్లిపై గత కొంతకాలంగా నెలకొన్న మిస్టరీ ఎట్టకేలకు వీడింది. గతేడాది ఆదిల్‌ ని తాను పెళ్లి చేసుకున్నట్లు సావంత్ ఇప్పటికే బహిరంగంగా చెప్పినా..   ఆదిల్ మాత్రం తమకి పెళ్లి కాలేదంటూ బుకాయించాడు. దాంతో ప్రెస్‌ మీట్‌లో రాఖీ సావంత్ కన్నీళ్లు పెట్టుకుంది. ఆదిల్ తనని మోసం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆదిల్‌ని పెళ్లి చేసుకున్నప్పటి ఫొటోల్ని కూడా రాఖీ సావంత్ షేర్ చేసింది. ఆదిల్ మాత్రం అవి ఫేక్ అంటూ కొట్టిపారేశాడు. ఈ నేపథ్యంలో కొంత మంది బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా రాఖీ సావంత్‌కి మద్దతుగా నిలవడంతో ఆదిల్ మనసు మార్చుకున్నాడు. రాఖీ సావంత్‌తో పెళ్లి జరగడం నిజమేనని ఫైనల్ గా ఒప్పుకున్నాడు.

ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా ఆదిల్ వెల్లడించాడు. తాను రాఖీ సావంత్‌ని పెళ్లి చేసుకోలేదని ఎప్పుడూ చెప్పలేదని, తనకు కొన్ని సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అందుకే మౌనంగా ఉన్నానని తెలిపాడు.  అంతే కాకుండా వారి పెళ్లికి సంబంధించిన వీడియోతో పాటు.. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ రాఖీ అని రాసుకొచ్చాడు. దానికి రాఖీ సావంత్ కూడా థ్యాంక్స్ జాన్ అంటూ రిప్లై ఇచ్చింది. దాంతో మరోసారి రాఖీ సావంత్, ఆదిల్ పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.