ఆ ఆలయంలో రాఖీ కడితే..సోదరులకు ఏ కష్టం రాదు... ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఓపెన్

ఆ ఆలయంలో రాఖీ కడితే..సోదరులకు ఏ కష్టం రాదు... ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఓపెన్

భారతదేశం దేవాలయాల నిలయం.  మన దేశంలో లక్షల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. కొన్ని ఆలయాలకు చరిత్ర కలిగి ఉన్నాయి. మరికొన్ని ఆలయాలు అద్భుతమైన శక్తులున్నాయి.  అయితే  ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఓ ఆలయానికి కూడా  అంతే ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటుంది. 

రాఖీ  పండగ రోజే..

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఈ ఆలయం ఉంది. వంశీనారాయణ దేవాలయంగా పిలువబడే ఈ ఆలయం..ఏడాదిలో  ఒక్క రాఖీ పండగ రోజున మాత్రమే తెరుచుకుంటుంది.   సూర్యోదయంతో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. సూర్యాస్తమయం తర్వాత సంవత్సరం మొత్తం మూసివేయబడతాయి. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. అందుకే దీనిని బన్సి నారాయణ లేదా వంశీనారాయణ ఆలయం అని పిలుస్తారు. ఈ దేవాలయంలో శివుడు, గణేశుడు, వాన్ దేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. 

ఇక్కడ రాఖీ కడితే..

 రక్షాబంధన్ రోజున వంశీ నారాయణ్ ఆలయంలో  తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కడితే..వారు ఎల్లప్పుడు ఆనందంగా, సిరి సంపదలతో జీవిస్తారని నమ్మకం. అంతేకాదు  సోదరులు  ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందులు, కష్టాలకు గురికారని భావిస్తారు. 

ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులభం కాదు. ముందుగా  చమోలిలోని ఉర్గామ్ వ్యాలీకి చేరుకోవాలి. అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం నడవాలి. అందుకే ట్రెక్కింగ్ చేస్తూ చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు.  రైళ్లో వెళ్తే..హరిద్వార్ రిషికేశ్ రైల్వే స్టేషన్‌లో దిగాలి. రిషికేశ్ నుండి జోషిమఠం  వరకు దూరం దాదాపు 225 కి.మీ ఉంటుంది. ఈ లోయ జోషిమఠం  నుండి 10 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ నుండి మీరు ఉర్గాం గ్రామానికి చేరుకోవచ్చు. దీని తర్వాత కాలినడకన వెళ్లి వంశీనారాయణ దేవాలయానికి చేరుకోవాలి.

ఆలయం ఎలా ఏర్పడింది..చరిత్ర ఏంటీ..

పురాణాల ప్రకారం.. బలి చక్రవర్తి  అహంకారాన్ని అణిచివేసేందుకు విష్ణువు వామనునిగా అవతరించాడు. ఇంతలో బలి.. విష్ణువును తన ద్వారపాలకుడిగా చేస్తానని వాగ్దానం చేసి.. తన ద్వారపాలకుడిగా నియమించుకున్నాడు. అయితే తన భర్త మహా విష్ణువుని తిరిగి తీసుకురావాలని లక్ష్మీఅమ్మవారు నారదుడిని కోరుకుంటుంది. అప్పుడు నారద ముని బలికి  రాఖీ కట్టమని..పరిష్కారాన్ని సూచిస్తాడు.  మారుమూల లోయలో లక్ష్మీదేవి ఇక్కడ కొలువుదీరి..బలికి రాఖీ కడుతుందట. ఆ తర్వాతే రాఖీ పండగను జరుపుకోవడం మొదలైందని ఇక్కడ  విశ్వసిస్తారు. అంతేకాదు  విష్ణువు వామన అవతారాన్ని కూడా ఇక్కడే చాలించాడని చెబుతారు. ఇక్కడి ప్రజలు.. గుడి దగ్గరే  ప్రసాదాన్ని తయారు చేస్తారు.  ఈ ప్రసాదం కోసం ప్రతి ఇంటి నుండి వెన్నను సేకరిస్తారు. అనంతరం ప్రసాదాన్ని తయారు చేసిన తరువాత.. దానిని విష్ణువుకు నైవేద్యంగా సమర్పిస్తారు