టాలీవుడ్లో బాక్సాఫీస్ వార్.. బరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్, మంచు విష్ణు

టాలీవుడ్లో బాక్సాఫీస్ వార్.. బరిలో ఎన్టీఆర్, రామ్ చరణ్, మంచు విష్ణు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో భారీ బాక్సాఫీస్ వార్ కి రంగం సిద్ధమవుతోంది. టాప్ స్టార్స్ కి సంబందించిన మూడు పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో రామ్ చరణ్(Ram charan), ఎన్టీఆర్(Ntr), మంచు విష్ణు(Manchu Vishnu) సినిమాలు ఉన్నాయి. ఇక్కడ వీశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవలే బిగ్గెస్ట్ సంక్రాంతి వార్ ముగిసిన విషయం తెలిసిందే. ఆ సందడి నుండి ప్రేక్షకులు ఇంకా బయటకు రాకముందే.. మరో బిగ్గెస్ట్ వార్ కు సిద్ధమవుతున్నారు మేకర్స్. 

ముందుగా రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా 2024 సంక్రాంతికి రావాల్సింది కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి దసరా బరిలో నిలువనుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. 

ఇక ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ తో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. ఈ సినిమాను కూడా ముందు ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, ఈ సినిమా షూట్ లో నటుడు సైఫ్ ఆలీ ఖాన్ కు ప్రమాదం జరగడంతో పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అలా ఈ సినిమా కూడా దసరా బరిలో నిలువనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప విషయానికి వస్తే.. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నారు మేకర్స్. మంచు ఫ్యామిలీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం వర్క్ చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ వర్క్ తో రానున్న ఈ సినిమాను కూడా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ప్లాన్ చేస్తున్నారట యూనిట్. 

మరి ఇదే గనుక నిజమైతే టాలీవుడ్ మరో భారీ బాక్సాఫీస్ వార్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ మూడు సినిమాల రిలీజ్ డేట్స్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో చూడాలి.