రామ్ చరణ్ ‘సిద్ధ’ టీజర్ రిలీజ్

రామ్ చరణ్ ‘సిద్ధ’ టీజర్ రిలీజ్
  • ఆపదొస్తే జయించడానికి మాలో అమ్మోరు తల్లి ఆవహిస్తుంది

చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్‌చరణ్ సిద్ధ క్యారెక్టర్‌కు సంబంధించిన టీజర్‌ ఇవాళ  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో రామ్ చరణ్ ఓ పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆచార్య పాత్రకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు రామ్ చరణ్ పాత్ర సిద్ధకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చాలా ఉత్కంఠ రేపేలా తీర్చిదిద్దారు.

రామ్ చరణ్ ఇంతకుముందెన్నడూ వేయని వెరైటీ  గెటప్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ లో రామ్ చరణ్ పాట, ఒళ్లు గగుర్పాటు కలిగించే రీతిలో ఫైటింగ్ దృశ్యాలు, అభిమానులే కాదు అందరూ పులకరించేలా ‘ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి అమ్మోరు తల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగులు ఫ్యాన్స్ కేక పెట్టిస్తాయి. టీజర్ చివరలో సెలయేటి ఒడ్డున ఒక వైపు చిరుతపులి, దాని పిల్ల మరో వైపు రామ్ చరణ్ అదే సెలయేటి నీళ్లు దోసిలిలో తీసుకుని తాగుతుంటే చిరంజీవి చిరుతపులులను గమనిస్తూ.. రామ్ చరణ్ దగ్గరకు నడుచుకుంటూ వచ్చే సీన్ అదిరిపోయింది. 
ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉండేలా తీసే కొరటాల శివ ఈ సినిమాను దేవాదాయ శాఖకు సంబంధించిన కథాంశంతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్‌, రామ్ చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు టీజర్ లో ప్రకటించారు.