
మెగా హీరో రామ్ చరణ్ తన అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని అందించేందుకు రెడీగా ఉన్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న'పెద్ది' మూవీ కోసం ఆయన త్రీవంగా శ్రమిస్తున్నారు. భారీ బడ్జెట్ తో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు రామ్ చరణ్ హింట్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక BTS ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొదటి సింగిల్ త్వరలో..
ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా పనిచేస్తున్న ఏఆర్ రెహమాన్ స్టూడియోలో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబులతో కలిసి ఉన్న ఫోటోను ఆయన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతంతో 'పెద్ది'. మా మాస్ట్రో 'పెద్ది' కళాత్మకను , భావోద్వేగాలను ఎన్నడూ లేని విధంగా తన సంగీతంలో నింపారు. మా మొదటి సింగిల్ త్వరలో వస్తుంది, చూస్తూ ఉండండి! అంటూ చరణ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ 'పెద్ది' సినిమాపై అభిమానుల అంచనాలను మరింత పెంచింది. AR రెహమాన్ సంగీతంలో రామ్ తొలిసారిగా నటించిన ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యాక్షన్ డ్రామాలో..
ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే క్రికెట్ టోర్నమెంట్ చుట్టూ తిరిగే స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం. ఈ యాక్షన్ డ్రామాలో చరణ్ నటన సరికొత్తగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తొలిసారిగా రామ్ చరణ్‌కి జోడీగా నటిస్తుండడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తోంది. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న ఈ 'పెద్ది' సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది. మరోవైపు 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోతున్న 'RC17' సినిమాపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్‌పై దృష్టి సారించిన చరణ్, త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌తో అభిమానులను అలరించనున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.