న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరంలో ఏకంగా 105 సార్లు విరాళాలు చోరీకి గురైనట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైందని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ నివేదిక వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం వెల్లడించారు. దర్యాప్తు తుది దశకు చేరుకుందని, ఈ నెల 25 నాటికి చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. కాగా ఈ చార్జిషీట్‌పై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక మేజిస్ట్రేట్‌ను అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.
రామ మందిర విరాళాల గోల్‌మాల్ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సిట్ స్టేటస్ రిపోర్ట్‌ను పరిశీలించింది. ఇప్పటివరకు జరిగిన అరెస్టులు, సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు. విలువైన వస్తువులను సాఫ్ట్‌వేర్ ద్వారా రశీదులు రాసి, ఎస్బీఐ లాకర్‌లలో భద్రపరుస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు.
కాగా, నివేదిక ప్రతి ఇవ్వాలని పిటిషనర్లు కోరగా.. సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ వివాదం చెలరేగడంతో ట్రస్ట్ ఉన్నతాధికారులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను పదవుల నుంచి తప్పించారు.
