అయోధ్యలో కొలువుదీరిన రామయ్య.. అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ

అయోధ్యలో కొలువుదీరిన రామయ్య..  అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ
  • ప్రధాని మోదీ చేతుల మీదుగా క్రతువు నిర్వహించిన వేద పండితులు 
  • వేలాది మంది ప్రముఖులు, సాధువులు, లీడర్లు హాజరు
  • రామనామంతో మారుమోగిన అయోధ్య.. దేశవిదేశాల్లోనూ ప్రత్యేక పూజలు 
  • రాత్రి దేశవ్యాప్తంగా రామజ్యోతి వెలిగించి దీపావళి చేసుకున్న భక్తులు
  • నేటి నుంచి భక్తులకు బాలరాముడి దర్శనం

ఐదు వందల ఏండ్ల నిరీక్షణకు తెరపడింది.  కోట్లాది మంది భక్తుల స్వప్నం సాకారమైంది. చెదరని చిద్విలాసంతో.. బంగారు విల్లు, బాణంతో.. అభిజిత్​ లగ్నంలో తన జన్మభూమిలో అడుగుపెట్టిండు రామయ్య. భవ్యమందిరంలో దివ్యరూపంలో కొలువుదీరిండు. ఆ ఘడియ కోసం ఎదురుచూసిన ఎన్నో గుండెలు తన్మయత్వంతో ఉప్పొంగాయి. ఆనందబాష్పాలతో నయనాలు హారతులిచ్చాయి. జగమంతా  ‘జై శ్రీరామ్​.. జైజై శ్రీరామ్​’ అంటూ మార్మోగింది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగవైభవంగా సాగింది. ప్రత్యక్షంగా కొన్ని వేల మంది, పరోక్షంగా కోట్లాది మంది నీలమేఘశ్యాముడి వేడుకను తిలకించారు. పదకొండు రోజులుగా ఉపవాసదీక్షలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిగింది. సాధువులు, కరసేవకులు, ప్రముఖులు, సామాన్యులు తరలివచ్చి ఈ సంబురంలో పాలుపంచుకున్నారు. దేశవిదేశాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం ఇటు అయోధ్యలోని సరయూ నదీ తీరంతోపాటు అటు దేశవ్యాప్తంగా గుడులు, ఇండ్లలో రామజ్యోతిని జనం వెలిగించారు. 

అయోధ్య (యూపీ) : అయోధ్య ఆలయంలో బాల రామయ్య కొలువుదీరాడు. ఐదేండ్ల లేత ప్రాయం.. నిగనిగలాడుతున్న నల్లటి మేను ఛాయ.. చేతుల్లో బంగారు విల్లుబాణాలు, ధగ ధగ మెరిసే స్వర్ణాభరణాలు ధరించి.. అద్భుతమైన ముఖ వర్చస్సుతో భక్తులపై చల్లని చూపులు ప్రసరించేలా ఉన్న రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అభిజీత్ ముహూర్తంలో గర్భగుడిలో బాల రాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠాపన శుభ కార్యం మొదలైంది. వేద పండితులు నలబై నిమిషాలపాటు సంప్రదాయ పూజలతో క్రతువును దిగ్విజయంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, సాధువులు, పూజారులు పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 50 సంప్రదాయ వాయిద్యాలతో మంగళ ధ్వని చేశారు. రాముడికి ప్రధాని మోదీ వెండి ఛత్రం సమర్పించారు. అనంతరం సాష్టాంగ నమస్కారం చేశారు. క్రతువు ముగిసిన వెంటనే గర్భగుడిపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. అయోధ్య నగరమంతా రామనామంతో మారుమోగింది. వీధివీధినా పాటలు, నృత్యాలతో కళాకారులు సందడి చేశారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రముఖులు, సాధువులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను చూసి తన్మయత్వం చెందారు. రామ మందిరం వద్ద ఫొటోలు దిగుతూ సంబురపడ్డారు. 

కార్మికులతో మోదీ ముచ్చట 

ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు వచ్చే ముందు తాను హెలికాప్టర్ లో వస్తుండగా తీసిన అయోధ్య వీడియోను ప్రధాని ట్వీట్ చేశారు. అందులో రామ మందిరం చుట్టూ18 కిలోమీటర్ల పరిధిలో ఎటు చూసినా అందమైన పూల అలంకరణలతో, కాషాయ జెండాలతో అయోధ్య నగరం శోభాయమానంగా కనిపించింది. ఇక ప్రాణ ప్రతిష్ఠ వేడుకల ముగింపుతో ప్రధాని మోదీ పదకొండు రోజులుగా చేస్తున్న నియమ నిష్ఠలను కూడా సోమవారం ముగించారు. కార్యక్రమం అనంతరం ప్రధాని కుబేర్ తిల ఆలయాన్ని సందర్శించారు. రామ మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతో అక్కడ ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.   

ఉట్టిపడుతున్న తేజస్సు   

గర్భగుడిలో కొలువైన బాల రామయ్య ముఖంలో తేజస్సు ఉట్టిపడుతోంది. నల్లగా నిగనిగలాడుతున్న శరీరం.. ముఖంలో అద్భుతమైన వర్చస్సు చూడగానే తన్మయత్వానికి లోనుచేసేలా కనిపిస్తోంది. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బాల రాముడి విగ్రహాన్ని పసుపు పచ్చటి ధోతి, రత్న ఖచిత, స్వర్ణాభరణాలు, ఎరుపు, పసుపు, ఊదా రంగు పూల మాలలతో అందంగా అలంకరించారు. రఘువంశ ముద్రతో కూడిన అందమైన కిరీటం, కంఠాభరణం, కాళ్లకు బంగారు కడియాలు తొడిగారు. ఐదేండ్ల వయసులోని బాల రాముడి రూపం తొణికిసలాడేలా ఉన్న ఈ కృష్ణ శిలా విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. గర్భగుడిలో ఎత్తైన వేదికపై బాల రాముడి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. వేదికకు ముందువైపు కింద రాముడి పాత విగ్రహాన్ని కొలువుదీర్చారు. 

ప్రముఖుల హాజరు 

అయోధ్యలో వేడుకలకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తదితరులు హాజరయ్యారు. బాబా రాందేవ్, శ్రీశ్రీ రవిశంకర్, సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కంగనా రనౌత్, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమ మాలిని, చిరంజీవి.. పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, సునీల్ భారతి మిట్టల్, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తదితరులు హాజరయ్యారు. ఆహ్వానితులందరికీ ప్రత్యేక కండువాలు వేసి, తిలకం దిద్దుతూ స్వాగతం పలికారు. ప్రధాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలు కాకున్నా.. సోమవారం రాముడిని దర్శించుకునే అవకాశం లేకున్నా వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. అయితే, రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఆర్ఎస్ఎస్–బీజేపీ కార్యక్రమంలా మార్చేశారంటూ కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు గైర్హాజరయ్యారు. కాగా, వేడుకల సందర్భంగా అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో కూడిన పది వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

దేశమంతా రామమయం 

అయోధ్య వేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోమవారం టెంపుల్స్ అన్నింట్లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన భక్తులు ఊరేగింపులు, పూజలు, అన్నదానాలతో ఘనంగా సంబురాలు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోనూ టెంపుల్స్ లో ఇండియన్లు వేడుకలు నిర్వహించారు. ప్రజలు వేడుకలను లైవ్ లో చూసేందుకు, పూజల్లో పాల్గొనేందుకు వీలుగా అనేక రాష్ట్రాల్లో సోమవారం సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్ డే సెలవు ఇచ్చారు.

కొత్త శకానికి నాంది

2024 జనవరి 22 అనేది కేవలం ఒక తేదీ కాదు.. కొత్త శకానికి నాంది. రామ మందిర నిర్మాణం దేశ ప్రజల్లో కొత్త శక్తిని నింపింది. ప్రజలు ఈ తేదీని, ఈ సందర్భాన్ని వెయ్యేండ్లు గుర్తుంచుకుంటారు. ఇది మన విజయానికే కాదు.. వినయానికీ సూచిక.

రాముడు నిప్పు కాదు.. శక్తి. రాముడు వివాదం కాదు.. సమాధానం. రాముడు ఏ ఒక్కరివాడో కాదు.. మనందరి వాడు. ఆయన వర్తమానం మాత్రమే కాదు.. శాశ్వతం కూడా.
- ప్రధాని నరేంద్ర మోదీ