మంచిర్యాలలో నత్తనడకన రాముని చెరువు బ్యూటిఫికేషన్

మంచిర్యాలలో నత్తనడకన రాముని చెరువు బ్యూటిఫికేషన్
  •     ఏండ్లు గడుస్తున్నా ముందుకు సాగని పనులు 
  •     ఆహ్లాదం కోసం అవస్థలు పడుతున్న ప్రజలు 
  •     పనుల్లో జాప్యంతో వాకర్స్​కు ఇబ్బందులు  
  •     అభివృద్ధి లేక బోసిపోతున్న చిల్ర్డన్​ పార్క్​ 
  •     ఊసే లేని బోటింగ్​ ఏర్పాట్లు  

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల టౌన్​లో ప్రజల ఆహ్లాదానికి ఎలాంటి  ఏర్పాట్లు లేకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వీకెండ్​లో, హాలీ డేస్​లో ఫ్యామిలీతో కాసేపు ఉల్లాసంగా గడపడానికి ఉన్న ఒకే ఒక్క స్పాట్​రాముని చెరువు   అభివృద్ధిపై మున్సిపాలిటీ  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.  ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం కారణంగా బ్యూటిఫికేషన్​ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగేండ్ల కిందట టీయూఎఫ్​ఐడీసీ నుంచి రూ.3.50 కోట్లు శాంక్షన్​ అయినప్పటికీ వెంటనే పనులు చేపట్టకుండా ఫండ్స్​ మురుగబెట్టారు.  డీపీఆర్ తయారీ, టెండర్ల నిర్వహణ, సర్కారు పర్మిషన్లు అంటూ రెండేండ్లకు పైగా   డిలే చేశారు. ఎట్టకేలకు నిరుడు ఏప్రిల్​లో వర్క్​ స్టార్ట్​ చేసినప్పటికీ అనుకున్నంత స్పీడ్​గా జరగడం లేదు. వచ్చే వానకాలం లోపు పనులు కంప్లీట్​ చేయకుంటే మరో ఏడాది ఎదురుచూపులు తప్పవు.  

మత్తడికి గండి కొట్టి చెరువును ఎండబెట్టిన్రు

రాముని చెరువు బ్యూటిఫికేషన్​లో భాగంగా సిల్ట్​ తీయడం కోసమంటూ మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు రెండు ఏండ్ల  కిందట మత్తడికి గండి కొట్టారు. ఎండకాలంలో ఎలాంటి పనులు చేయకుండా వానకాలంలో మత్తడికి గండి కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత మరో ఏడాది పాటు కాలయాపన చేసి ఎట్టకేలకు నిరుడు ఆగస్టులో పనులు మొదలు పెట్టారు. కొన్నేండ్ల నుంచి చెరువును పట్టించుకోకపోవడం వల్ల హైటెక్​ సిటీ, జాఫర్​నగర్​ నుంచి వచ్చే మురుగునీరు, సిల్ట్​తో పాటు  గుర్రపు డెక్క, తామర, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. సిల్ట్​ తొలగింపు కోసం మరోసారి మత్తడి గండిని పెద్దగా చేయడంతో చెరువు మొత్తం ఖాళీ అయ్యింది. సిల్ట్​ తొలగింపు పేరిట ఇష్టారీతిన మట్టితీసి ఇటుక బట్టీలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు రావడంతో ఆ పనులను సైతం ఆపేశారు. గత సంవత్సరం నుంచి చెరువులో నీళ్లు లేకుండా బోసిపోతోంది.  

చేయాల్సిన పనులివే

రాముని చెరువు బ్యూటిఫికేషన్​ వర్క్​ స్టార్ట్​ చేసి ఏడాది కావస్తున్నా ఒక్క పనీ కూడా పూర్తికాలేదు. చెరువు కట్టను వెడల్పు చేసి బండరాళ్లతో చేసే రివిట్​మెంట్ పనులు ఆగుతూ సాగుతున్నాయి. చెరువు కట్టపై వాకింగ్​ ట్రాక్​, రెండు పక్కల ఐరన్​ గ్రిల్స్​, హైటెక్​ సిటీ, జాఫర్​ నగర్​ ప్రాంతాల వైపు చెరువులో బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి మెట్ల నిర్మాణం తదితర పనులు నేటికీ మొదలు కాలేదు. చెరువులో పెరిగిన గుర్రపు డెక్క, తామర, పిచ్చిమొక్కలు, సిల్ట్​ తొలగింపు పనులు పెండింగ్​ ఉన్నాయి. హైటెక్​ సిటీ, జాఫర్​ నగర్​ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటి ట్రీట్​మెంట్​ ప్లాంట్ల నిర్మాణాలకు మోక్షం కలగడం లేదు. ఎండకాలంలోగా ఈ పనులన్నీ పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే చెరువు కింద రూ.80 లక్షలతో చిల్ర్డన్స్​ పార్క్​ డెవలప్​మెంట్​వర్క్స్​ అర్ధాంతరంగా ఆగిపోయాయి. పార్క్​ ముందుభాగంలో ఏర్పాటు చేసిన ఓపెన్​ జిమ్​ను నిర్వహణ అధ్వానంగా మారింది. దానిని పట్టించుకునే నాథుడు లేక పరికరాలన్నీ దొంగలపాలవుతున్నాయి. అలాగే టూరిజం డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో బోటింగ్​ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దానికి ఇంతవరకు అతీగతీ లేకపోవడం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.  

గతంలో చేసిన పనులు వృథా

రాముని చెరువు అభివృద్ధి కోసం గతంలో సుమారు రూ.80 లక్షల దాక ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2005 లో  రూ.40 లక్షలతో పార్క్​ డెవలప్​ చేశారు. కట్టను వెడల్పు చేయడంతో పాటు చెరువు మధ్యలో నుంచి రోడ్డు నిర్మించారు. పలు రకాల మొక్కలు నాటి లైటింగ్​ ఏర్పాటు చేశారు. బోటింగ్​ కోసం మెట్లు నిర్మించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్క్​ను ప్రారంభించకుండానే ఆనవాళ్లు కోల్పోయింది. చెరువు చెట్టూ కబ్జాలు పెరగడం వల్ల 2017లో అప్పటి కలెక్టర్​ ఆర్​వీ.కర్ణన్​ భూసర్వే చేయించి చుట్టూ కట్ట నిర్మించారు. అప్పట్లో అది వాకింగ్​ ట్రాక్​గా ఉపయోగపడ్డప్పటికీ క్రమంగా పిచ్చిమొక్కలు పెరగడంతో వాకర్స్​ అటువైపు వెళ్లడమే మానేశారు.

వాకర్స్​ అసోసియేషన్​ నిరసన

మంచిర్యాలలోని హైటెక్​సిటీ, జన్మభూమినగర్, లక్ష్మీనగర్​, గౌతమినగర్​, జాఫర్​నగర్ తదితర కాలనీల ప్రజలు రాముని చెరువు కట్టపై వాకింగ్​ చేస్తుంటారు. రోజూ పొద్దుట, సాయంత్రం వందల మంది వాకింగ్​ కోసం ఇక్కడికి వస్తుంటారు. చెరువు కట్ట వెడల్పు, రివిట్​మెంట్​ పనుల కోసం మట్టి కుప్పలు, బండరాళ్లు వేయడం, గుంతలు ఏర్పడడంతో వాకింగ్​ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యూటిఫికేషన్​ పనుల్లో జాప్యానికి నిరసనగా వాకర్స్​ అసోసియేషన్​ సభ్యులు  ఆదివారం ఆందోళన చేపట్టారు. వానకాలం వచ్చేలోగా పనులన్నీ పూర్తి చేయాలని డిమాండ్​ చేశారు. లేకుంటే ప్రజాప్రతినిధుల, కాంట్రాక్టర్​ ఇండ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.