జగమంతారామమయం.. విదేశాల్లో అయోధ్య సంబురాలు

జగమంతారామమయం.. విదేశాల్లో అయోధ్య సంబురాలు

వాషింగ్టన్ : అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. వివిధ దేశాల్లోని మనోళ్లు అక్కడి ఆలయాలు, ప్రముఖ ప్రాంతాల్లో పూజలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ‘నాస్ డాక్’ స్ర్కీన్ పైనా అయోధ్య రామమందిరం, రాముడి చిత్రాలను ప్రదర్శించారు. వర్జీనియాలోని ఎస్వీ లోటస్ టెంపుల్ లో నిర్వహించిన వేడుకలకు 2,500 మంది భక్తులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో సిక్కులు, ముస్లింలు, పాకిస్తానీలు కూడా పాల్గొన్నారు. లాస్ ఏంజెలిస్ లో 250 కార్లతో ర్యాలీ నిర్వహించగా, దానికి వెయ్యి మంది హాజరయ్యారు. కాగా అమెరికా, కెనడాలోని వెయ్యి ఆలయాలను సందర్శించనున్నట్టు వరల్డ్ హిందూ కౌన్సిల్ ఆఫ్ అమెరికా, విశ్వహిందూ పరిషత్–కెనడా ప్రకటించాయి. ఈ యాత్ర మాసాచుసెట్స్ నుంచి మార్చి 25న మొదలవుతుందని తెలిపాయి. అయోధ్య అక్షింతలను పంచిపెట్టేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్టు పేర్కొన్నాయి. 

మారిషస్ లో ఉద్యోగులకు సెలవు.. 

రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో పెద్ద ఎత్తున వేడుకలునిర్వహించారు. దీనికి 5 వేల మందికి పైగా ఇండియన్స్ హాజరయ్యారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు, పూజలు చేసుకునేందుకు వీలుగా మారిషస్ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు 2 గంటలు సెలవు ఇచ్చింది. ‘‘అయోధ్యకు శ్రీరాముడు తిరిగొస్తున్న వేళ మనమంతా సంతోషిద్దాం. మనం శాంతి, శ్రేయస్సు వైపు అడుగులు వేసేలా ఆయన ఆశీస్సులు కొనసాగాలని ప్రార్థిద్దాం. జై హింద్.. జై మారిషస్” అని మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌథ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మెక్సికోలోని క్వెరెటారో సిటీలోనూ రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ దేశంలో ఇదే మొదటి రాముడి ఆలయం. ‘‘విగ్రహాలను ఇండియా నుంచి తెప్పించాం. అమెరికాకు చెందిన పూజారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 250 మందికి పైగా ఇండియన్స్ హాజరయ్యారు” అని మెక్సికోలోని ఇండియన్ ఎంబసీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మెక్సికోలో మొట్టమొదటి హనుమాన్ ఆలయాన్ని కూడా క్వెరెటారో సిటీలోనే నిర్మించినట్టు పేర్కొంది. ఈ నెల 18–22 వరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, సనాతన ధర్మ ప్రతినిధి సభ ఆధ్వర్యంలో ఫిజి దేశంలో వేడుకలు నిర్వహించారు.